గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్ని సీట్లు గెలుస్తాం? అన్నదానిపై ఖచ్చితమైన అంచనా లేకుండానే, ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని ప్రకటించేయడంతో గందరగోళం చెలరేగింది. మిత్రపక్షం బీజేపీ, ఈ విషయమై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు కూడా కనిపించింది. ‘గ్రేటర్ ఎన్నికల విషయమై బీజేపీ ముఖ్య నేతలు పవన్‌ని కలవబోతున్నారు’ అని కూడా చెప్పేసుకుంది జనసేన. కానీ, నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాతనే బీజేపీ సీనియర్ నేతలు, జనసేనానిని కలిశారు.
విస్తృత ప్రయోజనాలా.? చిత్తశుద్ధిలేని రాజకీయాలా.?
గెలుపోటముల సంగతి తర్వాత.. ముందంటూ పోటీ చేస్తే, పార్టీకి వున్న బలమేంటో తెలుస్తుంది. అదే జనసైనికులూ అనుకున్నారు. కానీ, విస్తృత ప్రయోజనాల కోసమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. బీజేపీకి మద్దతివ్వాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. దాంతో, జనసేన శ్రేణులు షాక్‌కి గురయ్యారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు, వాటిని ఉపసంహరించుకోవాల్సి రావడంతో నీరసించిపోయారు.
బీజేపీకి జనసేన ఓటు ఎంతవరకు లాభం.?
భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునివ్వడం అనేది మిత్రధర్మమే. కానీ, అది జరుగుతుందా? అన్నదే కీలకమైన ప్రశ్న ఇక్కడ. పార్టీ తీరు పట్ల జనసైనికుల్లో అసహనం కనిపిస్తోంది. ‘ముందే ఈ విషయమై జనసేనాని, పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చి వుండాల్సింది..’ అన్నది వారి ఆవేదన. ఆశ పెట్టి, ఆ ఆశలపై నీళ్ళు చల్లేయడం అధినేతకు తగదంటూ జనసైనికులు వాపోతున్నారు. వారి ఆవేదనను చల్లార్చడం అంత తేలికైన వ్యవహారం కానే కాదు.
జనసేనకు బీజేపీతో లాభమేంటి.?
మిత్రధర్మమంటే ఇరువురికీ లాభముండాలి. ఓ పదో, పాతికో సీట్లు జనసేన తీసుకుని వుంటే, అందులో కొన్ని గెలిచినా.. బీజేపీ వల్ల లాభపడిందనే భావన వుండేది.. రాజకీయంగానూ జనసేనకు అదో ప్లస్ పాయింట్ అయ్యేది. ‘క్రమంగా బీజేపీ నేతగా మారిపోతున్న జనసేనాని..’ అనే విమర్శలకు తాజా రాజకీయ పరిణామాలు ఆస్కారమిచ్చాయి.