టీడీపీ – జనసేన మధ్య రాజమండ్రి కేంద్ర కారాగారం సాక్షిగా పొత్తు కుదిరింది. చంద్రబాబేమో జైల్లో.. పవన్ కళ్యాణ్ బయట.! ఈ పొత్తు కుదరడం అనేదేదో.. చంద్రబాబు బయటే వున్నప్పుడు జరిగి వుంటే ఇరు వర్గాలకూ ఒకింత లాభసాటిగా వుండేదేమో.!
నిజానికి, ఇప్పుడే పొలిటికల్ మైలేజ్ కాస్త ఎక్కువ రావొచ్చనేవారూ లేకపోలేదు. పాపం నారా లోకేష్ అలాగే నందమూరి బాలకృష్ణ బఫూన్లలా మిిలిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందర. ‘దత్త పుత్రుడు’ అనే ఆరోపణలు తొలుత చేసిన నారా లోకేష్, బ్లడ్డు.. బ్రీడు.. అంటూ ఎగతాళి చేసిన బాలకృష్ణ.. ఇద్దరూ పవన్ కళ్యాణ్ వెనకాల నడవడానికే పరిమితమయ్యారు.
ఇక, చంద్రబాబు ఎప్పుడూ మనుషుల్ని గౌరవించరు. అవసరానికి వాడుకుని వదిలేస్తారు. పిల్లనిచ్చిన మామ అయినా, ఇంకెవరైనా.. చంద్రబాబు దృష్టిలో అంతా ఒకటే. ఆయనకు ఆయన రాజకీయ అవసరాలే ముఖ్యం. అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్‌ని ముందు ముందు చంద్రబాబు లెక్క చేస్తారా.?
చంద్రబాబు జైల్లో వున్నారు గనుక, ఆయన ముఖ కవళికలు ప్రస్తుతానికి మనకి తెలియవు. జైలు నుంచి బయటకు వస్తే, ఆయన హావభావాలు ఎలా వుండబోతున్నాయో. చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎఫ్ఐఆర్ గనుక కొట్టివేయబడితే, ఇక చంద్రబాబుని ఆపలేం.
లేదూ, చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి రాకపోతే మాత్రం, జనసేనాని పవన్ కళ్యాణ్ దశ తిరిగినట్లే. చంద్రబాబు చుట్టూ తిరగడం కంటే, పవన్ కళ్యాన్ వెంట నడవడం మంచిదని టీడీపీ నేతలు భావించినా ఆశ్చర్యమేముంటుంది.?
అందుకే, టీడీపీ అనుకూల మీడియా అప్పుడే కంగారు పడుతోంది. 28 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లను జనసేనకు ఇవ్వనున్న టీడీపీ.. అంటూ కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఏమో, ఏం జరుగుతుందో మరి.!
ఇంతకీ, జైల్లో మొలిచిన పొత్తు అనే మొక్కని చంద్రబాబు పీకెయ్యడానికి పెద్దగా సమయం అవసరమంటారా.?