‘ఓ పిచ్చోడు సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు.. ఇంకో పిచ్చోడేమో మహనీయుల ఘాట్లను కూల్చేస్తామంటున్నాడు.. ఈ పిచ్చోళ్ళ మాటల్ని వినొద్దు.. అభివృద్ధికి ఓటెయ్యండి.. అరాచకాలకు ఓటేస్తే ఆగమైపోతాం..’ అంటూ పదే పదే ఒకటే మాట చెబుతున్నారు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఇంతకీ, ఆ ఇద్దరు పిచ్చోళ్ళెవరు.? కేటీఆర్ విమర్శిస్తోన్నది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించే. అదే సమయంలో, బీజేపీ నేతలు కూడా ఈ తరహా ‘పిచ్చి’ విమర్శలు చేస్తున్నారు.. అదీ అధికార పార్టీపైనా, స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పైనా.
సెటిలర్ల ఓట్లపై కన్నేసిన కేటీఆర్..
‘తెలంగాణ ఏర్పడ్డాక సెటిలర్లను కూడా తెలంగాణ ప్రజల్లా చూసుకున్నాం. అసలు తెలంగాణ, తెలంగాణేతర అన్న బేధం మేమెక్కడా చూపించలేదు..’ అంటూ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఊదరగొట్టేస్తున్నారు. ఆయా కుల సంఘాలతోనూ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ తరహా వ్యూహాలు రచించడంలో కేటీఆర్ దిట్ట. ఆర్య వైశ్యులతో తాజాగా కేటీఆర్ సమావేశమయ్యారు. ‘మీ వ్యాపారాలు బాగుండాలంటే టీఆర్‌ఎస్‌ని గెలిపించండి.. ఇతర పార్టీలు గెలిస్తే, ఆగం చేస్తాయ్..’ అంటూ కేటీఆర్ హెచ్చరించేశారు. సెటిలర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో కేటీఆర్ ఒకింత ప్రత్యేక శ్రద్ధతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం.
టీఆర్‌ఎస్ మాటలు వింటే మునిగిపోతారన్న బీజేపీ
‘ఆరేళ్ళలో టీఆర్‌ఎస్ ఏమీ చెయ్యలేదు.. అభివృద్ధి చేశామని చెప్పే హక్కు టీఆర్‌ఎస్‌కి లేదు. అంతలా అభివృద్ధి చేసేస్తే, హైద్రాబాద్‌లో ఇంకా ఎందుకు మురికివాడలున్నాయో కేటీఆర్ చెప్పాలి..’ అని డిమాండ్ చేస్తోంది బీజేపీ. తాము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నది పాత బస్తీలో అక్రమంగా నివాసం వుంటోన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ టెర్రరిస్టుల గురించి మాత్రమేననీ, తమకు ముస్లింల పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదనీ బండి సంజయ్ స్పష్టతనిచ్చేశారు. ‘మేం 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం.. మాకు ముస్లింల ఓట్లు కూడా పడ్డాయి. మేం అన్ని మతాల్నీ గౌరవిస్తాం..’ అని చెబుతున్నారు బండి సంజయ్.
ఈ చలాన్ల గోలేంటి.?
‘హెల్మెట్ పెట్టుకోకపోయినా చలాన్లు వుండవట.. రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్లకు కారణమైనా జరీమానాలు విధించరట.. యువతను తప్పుదోవ పట్టిస్తోంది బీజేపీ..’ అన్నది కేటీఆర్ వెర్షన్. ‘మేం మోటారు వాహన చట్టానికి వ్యతిరేకం కాదు. మేం అలాంటి ఉల్లంఘనలకు జరీమానాల్ని ఉపసంహరిస్తామని చెప్పడంలేదు. అవి ప్రజల భద్రత కోసం పెట్టుకున్నవే. అన్యాయంగా వేసిన చలాన్లను మాత్రమే రద్దు చేస్తామని చెప్పాం..’ అంటున్నారు బండి సంజయ్.
ఇంతకీ పెద్ద పిచ్చోడెవరు.!
గ్రేటర్ ఎన్నికల వేళ ఈ పిచ్చోళ్ళ పంచాయితీ ఎక్కువైపోయింది. ఎన్నికలనగానే ‘ఉచిత’ హామీలు మామూలే. కానీ, నేతల మాటలు హద్దులు దాటేస్తోంటే, పార్టీలకతీతంగా ఆయా నేతల్ని జనం పిచ్చోళ్ళలానే చూస్తున్నారు. అందుకేనేమో, చాలా బస్తీల్లో నేతల ప్రచారాల్ని అడ్డుకుంటున్నారు, నిలదీస్తున్నారు. జనాల్ని చూసి ఎలాగోలా ఓటేసేస్తార్లే.. అని నమ్మే ఏ రాజకీయ నాయకుడైనాసరే, ‘పెద్ద పిచ్చోడు’ కిందే లెక్క.. అన్నది ప్రజాస్వామ్యవాదుల వాదన.