గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపుకు వచ్చింది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే అస్త్ర శస్త్రాల్ని వాడేశాయి ఎన్నికల ప్రచారంలో. అడ్డగోలుగా తిట్టుకున్నారు, అర్థం పర్థం లేని హామీలు ఇచ్చేశాయి. గల్లీ ఎన్నికలకి (కార్పొరేషన్ ఎన్నికల్ని) కాస్తా, ఢిల్లీ ఎన్నికల స్థాయిలో (జాతీయ స్థాయి ఎన్నికల్లా) రాజకీయ పార్టీలు భావించాయి. కనీ వినీ ఎరుగని రీతిలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. ప్రచారం కోసం జనాన్ని తరలించేందుకు పార్టీలు పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేవ్, అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే తీరు. ప్రచార గడువు ముగిశాక అసలు ‘అంకం’ తెరపైకొస్తుంది. అదే కరెన్సీ పంపిణీ. ఇప్పటికే పలు డివిజన్లలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆయా పార్టీలకు చెందిన నేతలు అడ్డంగా బుక్కయిపోతున్నారు మీడియా కెమెరాలకి. నేటి రాత్రి పరిస్థితి ఇంకోలా వుండబోతోంది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు, పంపిణీ వ్యవహారాలకు సర్వసన్నద్ధమైపోయారు. సరిగ్గా ఈ సమయంలో బీజేపీ నేతలు ‘గులాబీ నోటు తీస్కో, కమలానికి ఓటు వేస్కో’ అంటూ రోడ్ షో సందర్భంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.
ఓట్ల పండగకి, కరెన్సీ నోట్ల జాతర లేకపోతే ఎలా.?
ఓటుకి ఐదొందలు ఇస్తారా.? రెండు వేలు ఇస్తారా.? ఐదు వేలు, పది వేలు ఇస్తారా.? అన్నదే ప్రశ్న తప్ప, ఓటెయ్యడానికి కరెన్సీ నోటు ఇస్తారా.? ఇవ్వరా.? అన్నది అసలు ప్రశ్నే కాదు. ప్రధానంగా బస్తీల్లో ఈ పంపకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చీరలు, గృహోపకరణాలు, ఇతర బహుమతులు.. ఇది ఇంకో వ్యవహారం. ఏ రూపంలో అయినాసరే, ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లను గుద్దించుకోవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. గ్రేటర్ ఎన్నికల్లో ఓ కార్పొరేటర్ గెలిచి, గరిష్టంగా ఎంత వెనకేసుకోగలడు తన పదవీ కాలంలో.? అన్న అంచనాలతో సంబంధం లేకుండా ఆయా పార్టీలు ఈసారి ఖర్చు చేస్తుండడం విస్మయం గొలిపే అంశంగా చెప్పుకోవచ్చు.
పంపకాల్లో నెంబర్ వన్ ప్లేస్ ఎవరిది.?
ప్రధానంగా టీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య పోటీ వుండాలి. కానీ, టీఆర్‌ఎస్ – బీజేపీ మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో హల్‌చల్ చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కూడా డబ్బు పంపకాల ఆరోపణలు బీజేపీ మీదనే ఎక్కువగా వినిపించాయి. అయితే, తెలంగాణలో అధికారంలో వున్నది టీఆర్‌ఎస్ గనుక, ఆ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, డబ్బుల్ని పంచినా.. ఆ వ్యవహారాలు తెరపైకి రాలేదని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పంపకాలు ఎక్కువయ్యాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు, ఇతర జిల్లాల నుంచి నేతల్ని తీసుకొచ్చి, వారితో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారంటూ కొన్ని వీడియోల్ని తెరపైకి తెస్తున్నారు.
ఎన్నికల వేళ ఇలాంటి సిత్రాలు మామూలే..
బూతులు తిట్టుకోవడం.. దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం.. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం.. ఇవన్నీ ఎలాగైతే ఎన్నికల్లో సర్వసాధారణ వ్యవహారాలుగా మారిపోయాయో, అంతకు మించి డబ్బు పంపకం అనేది ఓ తప్పనిసరి వ్యవహారంగా మారింది. ఎవరెక్కువ పంచితే వాళ్ళే గెలుస్తారన్న నమ్మకం అభ్యర్థుల్లో, రాజకీయ పార్టీలో పెరిగిపోవడమే కష్టం. ఒక్కటైతే నిజం.. ఓడినోడు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు.