నిన్న మొన్నటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భజనలో మునిగి తేలిన గులాబీ నేతలు, అనూహ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భజనలో మునిగి తేలుతున్నారు. ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్..’ అంటూ టీఆర్ఎస్ ముఖ్య నేత పద్మారావు సంచలన వ్యాఖ్యలు.. అదీ కేటీఆర్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగాలి’ అనే డిమాండ్ ఇప్పటివరకు గులాబీ నేతలెవరి నుంచీ రావడంలేదుగానీ, దాదాపు నేతలంతా కేటీఆర్‌కే ‘జై’ కొడుతున్నారు. ఇంతకీ మంత్రి హరీష్ రావు పరిస్థితేంటి.? ఎమ్మెల్సీ కవిత పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే..’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గట్టిగా నినదించారు. మరి, ఇప్పుడు.. తాను ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగాల్సి వస్తే.. ఆ అవకాశం తన కుమారుడు కేటీఆర్‌కి కాకుండా, పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తోన్న దళిత నేతలెవరికైనా ఆ అవకాశం కల్పించొచ్చు కదా.? ఇదే చర్చ ఇప్పుడు గులాబా పార్టీలో, తారకరాముడి వ్యతిరేక వర్గం నుంచి కొంత గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే చాపకింద నీరులా ఈ వాదనకి బలం చేకూరుతున్న దరిమిలా, ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’ నినాదం, గులాబీ పార్టీలో రానున్న రోజుల్లో పెను రాజకీయ ప్రకపంనలు సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కేసీఆర్ చాలా ధృఢంగా కనిపిస్తున్నారు శారీరకంగా, మానసికంగా.
మరెందుకు, గులాబీ నేతలంతా కేటీఆర్ విషయంలో అత్యుత్సాహం చూపుతున్నట్లు.? వారినెందుకు కేటీఆర్ వారించడంలేదు.? ఇదిప్పుడు గులాబీ పార్టీలోనూ కొందరికి మింగుడు పడని వ్యవహారంగా తయారైంది. బీజేపీ, దుబ్బాక అలాగే గ్రేటర్ ఎన్నికల్లో కొట్టిన దెబ్బతో గులాబీ పార్టీలో అయోమయం పెరిగిందనీ, ఈ క్రమంలోనే కేసీఆర్ మీద నమ్మకం సన్నగిల్లి కేటీఆర్ మీద గులాబీ నేతలు ఆశలు పెంచుకుంటున్నారనీ ఓ వాదన విన్పిస్తోంది. ఇంకోపక్క చంద్రబాబు ఎలాగూ తన కుమారుడికి ముఖ్యమంత్రి యోగం కల్పించలేకపోయారు.. ఆ పరిస్థితి తనకు రాకుండా, కేసీఆర్ తొందరపడి, కేటీఆర్‌ని ముందుకు ఎగదోస్తున్నారనే వాదనా లేకపోలేదు. మొత్తమ్మీద, కేటీఆర్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైనట్లే కనిపిస్తోంది.. ముహూర్తం ప్రకటితమవడమే తరువాయి అనుకోవాలేమో.