నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరు తమ శరీర పరిశుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం స్నానం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి పునాది కూడా. చాలా మంది స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా బాడీ వాష్‌ను శరీరమంతా రాసుకుంటారు. ప్రత్యేకంగా మహిళల్లో ఈ అలవాటు మరింతగా కనిపిస్తుంది. కానీ, నిపుణులు చెబుతున్న హెచ్చరిక ఒక్కటే సబ్బును ప్రతి భాగానికి వాడడం ఆరోగ్యానికి ముప్పు కావచ్చు.. ముఖ్యంగా ప్రైవేట్ భాగాలకు అయితే చాలా ప్రమాదకరం.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహిళల ప్రైవేట్ ప్రాంతం చాలా సున్నితమైనది. ఆ భాగంలో సహజంగా ఉన్న మంచి బ్యాక్టీరియా శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అయితే సబ్బులో ఉండే రసాయనాలు ఆ బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్లు, దురద, కాలినట్టుగా మంట, వైట్ డిశ్చార్జ్ వంటి సమస్యలను కలిగించే ప్రమాదం ఉంటుంది. మార్కెట్లో లభించే ఎక్కువ సబ్బుల్లో సువాసన కలిగించే కెమికల్స్, సర్ఫాక్టెంట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిగా చేసి, యోని యొక్క సహజ పిహెచ్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి.
ప్రైవేట్ భాగాల పరిశుభ్రతను కాపాడుకోవడం కోసం కొంతమంది మహిళలు బాడీ వాష్ లేదా ప్రత్యేక క్లీనింగ్ లిక్విడ్స్ వాడుతారు. కానీ వాటిని కూడా నిపుణుల సూచన మేరకు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ ఉత్పత్తులు బాహ్య భాగాలకు మాత్రమే అనుకూలం. అంతర్గత భాగాలను కేవలం శుభ్రమైన నీటితో కడగడం సరిపోతుంది. పీరియడ్స్ సమయంలో కూడా ఇలానే చేస్తే చర్మానికి హానీ ఉండదు.
సబ్బు వాడకం వల్ల కేవలం ఇన్ఫెక్షన్లు మాత్రమే కాదు.. పునరావృతమయ్యే చర్మ వ్యాధులు, యూరినరీ ఇన్ఫెక్షన్లు, హార్మోనల్ అసమతౌల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువసేపు బయట తిరిగే మహిళలు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. సరైన పరిశుభ్రత అలవాట్లు పాటిస్తే చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు.
చాలామంది మహిళలు సబ్బు వాడితే శుభ్రంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ శాస్త్రీయంగా చూసుకుంటే ఇది విరుద్ధ ఫలితాన్నే ఇస్తుంది. వైద్యులు చెబుతున్నట్లు కేవలం గోరువెచ్చని నీరు, శుభ్రమైన తువాలు ఉపయోగించడం ఉత్తమ పద్ధతి. మార్కెట్లో లభించే ప్రత్యేక పిహెచ్ బ్యాలెన్స్ లిక్విడ్స్ వాడాలనుకుంటే, వైద్యుల సూచన తప్పనిసరిగా తీసుకోవాలి. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు వేర్వేరుగా ఉండవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.)
