Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి ముదురుతున్న సంక్షోభం.. యూనస్ vs ఆర్మీ!

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మధ్య విభేదాలు పెరిగిపోతుండటంతో దేశం రాజకీయం మరింత గందరగోళానికి లోనవుతోంది. గతంలో రిప్లేస్ అయిన షేక్ హసీనా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఈ తాత్కాలిక వ్యవస్థ ప్రారంభంలో సుభిక్షంగా సాగినా, ప్రస్తుతం పూర్తిగా విభేదాల వేదికగా మారిపోయింది.

ఎన్నికలు త్వరగా నిర్వహిస్తామన్న హామీపై యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పటికీ, నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో ఆర్మీ అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ మద్యలో శిక్షపడిన ఇస్లామిస్ట్ నేతలు, బీడీఆర్ తిరుగుబాటుదారులను విడుదల చేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ప్రత్యేకించి బీడీఆర్ తిరుగుబాటులో 57 మంది సైనిక అధికారుల హత్యలో శిక్షపడినవారిని విడుదల చేయడం, సైన్యంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.

యూనస్‌కు సమీపంగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో చర్చలు జరిపినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఈ విషయంపై స్పందించిన ఆర్మీ చీఫ్ వాకర్, హసన్‌ను తొలగించాలని ప్రయత్నించగా, యూనస్ ఆదేశాన్ని అడ్డుకున్నారు. ఇది సైనిక వ్యవస్థలో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం వాకర్, నౌకాదళం, వైమానిక దళం మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఇదే సమయంలో, అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించాలన్న యూనస్ నిర్ణయం, రాబోయే ఎన్నికల నిష్పక్షపాతతపై అనుమానాలు పెంచుతోంది. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ లేకుండానే ఎన్నికలు జరగబోతే ప్రజాస్వామ్య బలహీనపడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో పడినట్టే కనిపిస్తోంది.