అసహనంతో కుంచించుకుపోతున్న చంద్రబాబు 

Chandrababu naidu shrinking with impatience
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు  బొత్తిగా కాలం కలిసిరావడం లేదు.  2050 వరకు తమదే అధికారం అంటూ విర్రవీగితే తీరా అయిదేళ్లకే అతి ఘోర పరాభవం ఎదురైంది. ఆ అవమానం జరిగింది ఒకప్పటి తన సమకాలీనుడైన రాజశేఖర రెడ్డి కొడుకు చేతిలో.  తన కొడుకును చూద్దామంటే నిష్ప్రయోజకుడిగా, పిరికివాడిగా తేలిపోయేడు.  తన జెండా మీద గెలిచిన ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో తెలియడం లేదు.  అమరావతి పేరుతో కులరాజధానిని నిర్మించాలకే భ్రమలు పటాపంచలైపోయాయి. అస్మదీయులకు దోచిపెట్టిన వేలాది ఎకరాల భూముల కుంభకోణాలు బయటకి వస్తున్నాయి.  తనకు నమ్మకస్తులైన అనుచరులు అని భావించినవారి ఆర్థికమూలాలపై దెబ్బమీద దెబ్బ పడుతుండటం, కొంతమంది ప్రముఖ నాయకులు కుంభకోణాల్లో దోషులుగా ముద్రపడి జైలు జీవితాన్ని గడపడం, పులిమీద పుట్రలా తన వ్యాపార సామ్రాజ్యం హెరిటేజ్ కు అమూల్ రూపంలో బలమైన శత్రువు ఉదయించడం,  జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడం, తన భజన మీడియాకు ఆదాయం తగ్గిపోవడం లాంటి అనేక అంశాలు చంద్రబాబును తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి.  
 

Chandrababu naidu shrinking with impatience

లేకపోతె ఏమిటి?  అయిదు కోట్ల ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఫేక్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నోరు పారేసుకోవడం ఏమిటి?  యాభై శాతం ఓటింగ్ తో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డిని ఫేక్ అంటే ఇక వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎవరు?   సొంత మామగారికి ద్రోహం చేసి ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు దొడ్డిదోవలో అధికారం సంపాదించిన విషయం మర్చిపోతే ఎలా?  పోనీ, 1984 లో నాదెండ్ల భాస్కర రావు నుంచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుని, నాదెండ్ల వెన్నపోటుతో అసెంబ్లీ అపవిత్రం అయిందని తలచి ఆ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ప్రజాతీర్పు కోరిన నందమూరిలా మళ్ళీ ప్రజాతీర్పుకై వెళ్లకుండా నాలుగేళ్లు పదవిని అనుభవించడమే కాక ఎన్టీఆర్ పేరును సైతం తెలుగుదేశం పార్టీలో వినిపించకుండా జాగ్రత్త వహించిన చంద్రబాబు కన్నా ఫేక్ ఎవరుంటారు?  
 
అంత అనుభవం కలిగిన చంద్రబాబు మంత్రులను, గౌరవ శాసనసభ్యులను ఏకవచనాప్రయోగంతో దూషించడం మరింత ఘోరం.  1989 -1994  మధ్య ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు సభాపతి పోడియం లోకి దూసుకెళ్లి నిరసన తెలిపితే వారితో పాటు ఎన్టీఆర్ వెళ్ళలేదు.  అయినప్పటికీ ఆయన్ను కూడా అప్పటి స్పీకర్ సస్పెండ్ చెయ్యడంతో నిరసించిన ఎన్టీఆర్ మళ్ళీ తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని శపధం చేసారు.  కానీ, నేడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం సభామర్యాదలు విస్మరించి వెల్ లో కూర్చోవడం,  అప్రజాస్వామిక భాషను ప్రయోగించడం, గాలివాటంగా వచ్చారని దూషించడం చూస్తుంటే చంద్రబాబు మొదటిరోజే జగన్ బలగాన్ని చూసి ఏమాత్రం కడుపుమంటను భరించలేకపోతున్నారని అర్ధం అవుతుంది.  
 
చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆయనకు ప్రతిపక్షనేత హోదా పోయే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.  అధికారం పోగొట్టుకున్న ఏడాదిన్నరకే ఇంత అసహనమా?  హవ్వ! 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు