జగన్ పై చంద్రబాబు ఆఖరి బ్రహ్మాస్త్రం .. ఇది కూడా ఫట్ అయితే సూట్ కేస్ సర్దుకోవడమే

ChandraBabu Last Plan On YS Jagan
జగన్‌ను కార్నర్ చేసేందుకు చంద్రబాబు కొత్త ట్విస్ట్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త రాగం అందుకున్నారు! మూడు రాజధానుల అంశం అమరావతి ప్రాంతంలో వైసీపీని, దీనికి నో చెబుతున్నందుకు ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది స్వాగతిస్తున్నారు. తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని, దీనితో విబేధిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడుతో అంతర్గత సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మూడు రాజధానుల అంశం ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే ఇరకాటంలో పడేసింది.

Chandrababu Naidu
ChandraBabu Plan On YS Jagan
అదే చంద్రబాబు టార్గెట్, అందుకే ఈ నినాదం

దీంతో చంద్రబాబు నాయుడు తాజాగా ఓ కొత్త నినాదంతో జగన్‌ను ఇరుకున పడేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మన దేశానికి రాజధాని ఢిల్లీ. ఆర్థిక రాజధానిగా ముంబై పేరు చెబుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే బాట పట్టింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పారు. కానీ మూడు రాజధానుల విషయంలో పూర్తిగా ఇరకాటంలో పడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు మరోసారి తమ వాదనను బలంగా బయటకు తీసుకు వచ్చారు. ఆ అస్త్రమే విశాఖ ఆర్థిక రాజధాని. అసెంబ్లీలోనే దీనిపై ప్రకటన చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా ప్రకటించామని గుర్తు చేస్తూ, ఈ సరికొత్త అస్త్రం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడంతో పాటు జగన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

విశాఖపై ఏకరువు..

బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ… విశాఖపట్నంకు తమ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఏకరువు పెట్టారు. విశాఖను పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపకల్పన చేశామని, కానీ ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీ దందాల అడ్డాగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అయితే, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖ ప్రజలను భూకబ్జాలతో, బెదిరింపులతో, అక్రమ కేసులతో బెంబేలెత్తిస్తున్నారని, అదానీ డేటా కేంద్రం వచ్చి ఉంటే రూ.70వేల కోట్ల పెట్టుబడితో పాటు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి దొరికేదన్నారు. లూలూ కన్వెన్షన్ ఏర్పాటయితే అంతర్జాతీయ సదస్సులకు వేదికగా విశాఖ నిలిచేదని వాటిని రాకుండా చేసి అభివృద్ధిని నాశనం చేశారన్నారు.

Financial Capital- Vizag
Financial Capital- Vizag

తమ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించామని, ఎన్నో పెట్టుబడులు అక్కడకు వచ్చాయని, ఫిన్‌టెక్ ర్యాలీని ఏర్పాటు చేశామని, ఐఐఎంతో పాటు మిలీనియం టవర్స్, సెంట్రల్ పార్క్, ఇండోర్ స్టేడియం, హెల్త్ ఎరీనా, మ్యూజియాన్ని అభివృద్ధి చేశామన్నారు. మెట్రో రైలుకు నాంది పలికామన్నారు. ఓ విధంగా హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేశామని, వైసీపీ ప్రభుత్వం వాటన్నింటిని తొక్కి పెట్టేసిందన్నారు.

జగన్ ఆ దెబ్బతో మొదటికే మోసం వస్తుందని..

మూడు రాజధానుల అంశం ద్వారా ఎక్కువగా ఇరకాటంలో పడింది తెలుగుదేశం పార్టీయే. వైసీపీతో రాజకీయ విబేధాలు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం అనే అంశాలు పక్కన పెడితే, ప్రధానంగా తమ ప్రభుత్వం హయాంలోనే అమరావతిలో 34వేల ఎకరాలు సేకరించడంతో మూడు రాజధానులకు మద్దతు పలికే పరిస్థితి ఏమాత్రం లేదు. వైసీపీ అధికారంలో ఉండటం, మరో నాలుగేళ్ల పాటు అధికారం చేతిలో ఉండటంతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ కేంద్రం పరిధిలోనిది కాదని చెబుతోంది. ఇతర పార్టీలు అంతగా పోరాడటం లేదు. మిగిలింది తెలుగుదేశం పార్టీ. మూడు రాజధానులపై తీవ్రంగా పోరాడుతోంది. దీంతో ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతంలో వ్యతిరేకత గూడుకట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే సొంత పార్టీ నేతలు కూడా పార్టీని వీడటం, ఈ ఉద్యమానికి దూరంగా ఉండటం వంటివి చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇది మొదటికే మోసం వస్తుందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు తాము గతంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను గుర్తు చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.

YS Jagan
YS Jagan

విశాఖపట్నంను తాము పక్కన పెట్టలేదని, రాజధాని అమరావతి అయినప్పటికీ ఉత్తరాంధ్రలోని ఈ ముఖ్య పట్టణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజధాని మాత్రమే అమరావతి అని, కానీ తాము అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగులు వేశామని, విశాఖ, రాయలసీమ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు రాజధానులకు మాత్రమే వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించామని గుర్తు చేస్తున్నారు.