ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా చివరికి భారతీయ జనతా పార్టీ చూసుకునేది సొంత ప్రయోజనాలే. ఆంధ్రాలో బలపడటం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ను ఏ కోశానా లెక్క చేయట్లేదు. కీలకమైన అనేక విషయాల్లో అసలు ఆయనతో సంప్రదింపులు జరపకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అమరావతి, మూడు రాజధానులు లాంటి అంశాల్లో జనసేన అభిమతానికి విరుద్దంగా బీజేపీ స్టాన్డ్ తీసుకోవడాన్ని బట్టి అసలు అసలు పవన్‌ను కూటమిలో కొంచెమైనా విలువ ఉందా అనే అనుమానం వస్తోంది.
తాజాగా తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నికల విషయంలో కూడ బీజేపీ పవన్ ప్రమేయం లేకుండానే నిర్ణయం తీసుకున్నారు వార్తలొస్తున్నాయి. కొన్ని రోజులు క్రితమే వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. పార్టీలన్నీ అభర్ధుల్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. బీజేపీ, జనసేనల కూటమి కూడ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా బీజేపీ సొంతగా నిర్ణయం తీసేసుకుని తమ పార్టీకి చెందిన వ్యక్తిని ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. తిరుపతిలో బీజేపీకి కొంత క్యాడర్ ఉన్న మాట వాస్తవమే. 1999లో బీజేపీ నేత నందిపాకు వెనకటస్వామి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో సైతం బీజేపీ, టీడీపీల కూటమి తరపున బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం ఇక్కడ నుండి పోటీకి దిగి కొద్దిపాటి తేడాతో ఓటమిపాలయ్యారు.
ఈ రెండు కారణాలను చూపిస్తూ అక్కడ తమకు మంచి బలముందని, తమ పార్టీ వ్యక్తే బరిలోకి దిగుతాడని అంటుందట బీజేపీ. అలా అయితే తిరుపతిలో పవన్ కళ్యాణ్ సామాజికవర్గం కూడ గట్టిగానే ఉంది. గతంలో ఇక్కడ చిరంజీవి ఎమ్మెల్యేగా చేశారు. అలాంటప్పుడు నేరుగా పవన్నే అభ్యర్థిగా నిలబెట్టవచ్ఛు కదా లేకపోతే జనసేన నుండి వేరే ఎవరినైనా తీసుకుని వారికి బీజేపీ సపోర్ట్ చేయవచ్ఛు కదా అనే వాదన వినిపిస్తోంది. అలా కాకుండా తమ పార్టీ వ్యక్తే అభ్యర్థి అంటూ సొంత నిర్ణయాలు తీసేసుకోవడం చూస్తే జనసేనను తోక పార్టీగా, పవన్‌ను ఆ తోకలో ఈకలా తీసేశారేమో అంటున్నారు కొందరు.