దుబ్బాక ఉప ఎన్నికల గెలుపు బీజేపీకి భారీ కిక్ ఇచ్చింది. ఎన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపిస్తోంది ఆ పార్టీ. ఇకప్పుడు ఎన్నికలంటేనే వణికే బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నిక ఏదైనా సై అంటున్నారు. త్వరలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని కేసీఆర్ చెబుతూ వచ్చారు. కానీ దుబ్బాక ఫలితాలతో అన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో తెరాస 99 స్థానాలను కైవారం చేసుకోగా బీజేపీ నాలుగు స్థానాలే గెలిచింది. కానీ ఈసారి బీజేపీ సత్తా చాటేలా ఉంది. ఉప ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందని అర్థమైంది. అయితే అది కేవలం దుబ్బాకకే పరిమితమా లేకపోతే హైదరాబాద్లో కూడ ఉందా అనేది తేలాల్సి ఉంది.
బీజేపీ అయితే దుబ్బాకను మించిన అసంతృప్తి హైదరాబాద్లో ఉందని అంటున్నారు. వరదల సమయంలో నగరం నరకం చూసింది. చెరువులు, నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకనే ఈ ఉపద్రవం సంభంవించింది. జనం అధికార పార్టీ మీద నిప్పులు చెరిగారు. పరిహారం పంచె సమయంలో కూడ గులాబీ పార్టీ కార్పొరేటర్ల కార్యకర్తలు చేతులు తడుపుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ తెరాస మీద ప్రజల్లో వ్యతిరేకతను రాజేశాయని అంటున్నారు. దుబ్బాక ఫలితాల కంటే ముందు జరిపిన సర్వేల్లో తమకు 75 సీట్లు వస్తాయని తేలిందని, ఇప్పుడు సర్వే చేస్తే ఆ సంఖ్య 100 వరకు ఉంటుందని బండి సంజయ్ తేలిందన్నారు.
దుబ్బాకలో గెలిచి చూపిస్తాం అన్నప్పుడు కూడ బండి సంజయ్ మాటల్ని ఇలాగే లైట్ తీసుకున్నారు. కానీ పార్టీని గెలిపించి చూపించారు. కనుక ఆయన చెబుతున్న గ్రేటర్ సర్వే ఫలితాలను అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. దుబ్బాక పరిణామంతో బీజేపీ గ్రేటర్లలో పెద్ద ప్రభావం చూపిస్తుందని నమ్మొచ్చు కానీ ఆ ప్రభావం 75 సీట్ల వరకు ఉంటుందా లేకపోతే 100 సీట్ల వరకు వెళుతుందా అనేదే చెప్పలేం. పైపెచ్చు తాజాగా ఓల్డ్ సిటీ పన్నుల అంశాన్ని తెరపైకి తెచ్చారు బండి సంజయ్. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని తీసుకెళ్లి పాతబస్తీలో ఖర్చుపెడుతున్నారని, అసలు అక్కడ ఎంత పన్నులు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త ప్రశ్న ఆసక్తికరంగానే కాదు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కూడ ఉంది.