మస్ట్ రీడ్:: బండికి ఏది వద్దో.. కవితకు అదే కావాలి!

రాజకీయ నాయకులు చేప్పే వాదనలు, చేసే పనులూ ఒక్కోసారి “కామన్ మ్యాన్” కి బుర్రపాడు చేసేస్తుంటాయి. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… అల్టిమేట్ గా ప్రభుత్వాలకు అనుగుణంగా కొన్ని వ్యవస్థలు పనిచేస్తాయని.. ప్రభుత్వ వ్యవస్థల్లో లోపాలున్నాయని మాత్రం వారి వారి మాటలద్వారా స్పష్టమవుతుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బండి సంజయ్ – ఢిల్లీలో కల్వకుంట్ల కవిత చేస్తున్న పనులు ఇలాంటి నమ్మకాలనే ఇస్తున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన వ్యవహారం… టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్! ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే… ఈ లీకేజ్ లో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, కేటీఆర్ పీఏ పాత్ర కూడా ఉందని.. కేటీఆర్ ని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్లు చేశారు. దీంతో… ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. సంజయ్ కి నోటీసులు ఇచ్చారు.

మీడియా ముందు చెప్పిందే కాకుండా… ఇంకా ఈ వ్యవహారానికి సంబంధించి తమరికి ఏమేమి సంగతులు తెలుసో సవివరంగా తెలియజేస్తే… దర్యాప్తుకు ఎంతో సహకరించినవారవుతారని, నిజమైన దోషులకు శిక్షపడే విషయంలో సహాయం చేసినవారవుతారని సిట్ అడిగింది. ఫలితంగా విచారణకు రావాలని నోటీసులు పంపింది. కానీ… పార్లమెంటు సెషన్స్ పేరు చెప్పి సంజయ్ గైర్హాజరయ్యారు. సరే.. ఆరోజు కుదరకపోతే మార్చి 26 ఆదివారం అయినా రండని మరోసారి నోటీసులు పంపింది. అబ్బే కర్నాటక వెళ్తున్నాని అని ఆరోజు కూడా బండి మిస్సాయ్యారు!

ఈ గైర్హాజరుపై వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేసిన ఆయన… “సిట్ పై తనకు నమ్మకం లేదని, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తేనే తన దగ్గరున్న సమాచారం ఇస్తా అని.. లేకపోతే అస్సలు ఇవ్వను. కావాలంటే విచారణకు నా లీగల్ టీం ని పంపుతాను” అని వారిని పంపించారు. అంటే… బండి సంజయ్ కి సీబీఐ మీద, సిట్టింగ్ జడ్జి మీద మాత్రమే నమ్మకం ఉంది తప్ప… సిట్ మీద లేదన్నమాట!

కాసేపు ఆ సంగతి అలా ఉంచి… కవిత విషయానికొద్దాం! ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కవిత… ఈరోజు తాజాగా మరో కొత్త కోరిక కోరారు! అవును… ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను ఈడీతో కాకుండా.. “సిట్” ఏర్పాటు చేసి విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. “ఈడీ వద్దు సిట్ కావాలని బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత” ఢిల్లీలో అంటున్నారు. అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. “సిట్ వద్దు సీబీఐ కావాలని బీజేపీ నేత బండి సంజయ్” తెలంగాణలో అంటున్నారు. ఇక్కడ బీఆరెస్స్ అధికారంలో ఉంది.

ఇంతకు మించి క్లారిటీ అవసరం లేదు… “రాజకీయ పార్టీలు – ప్రభుత్వాలు – దర్యాప్తు సంస్థల అవినాభావ సంబంధం గురించి రాజకీయ నాయకులకు ఎంత స్పష్టమైన అవగాహన ఉంది” అనే విషయం తెలియడానికి!