సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావులపై.. ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..!

తెలంగాణ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ లోపలి పరిణామాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మండలికి వచ్చిన సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న కవిత, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కూడా కీలక ఆరోపణలు చేశారు.

కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ కవిత, ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడం హేయమైన రాజకీయమని విమర్శించారు. ఒక తండ్రిగా, ఉద్యమ నేతగా కేసీఆర్‌పై ఇలా మాట్లాడితే తన రక్తం మరిగిపోతుందని భావోద్వేగంగా స్పందించారు. కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం ద్వారా సీఎం తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని అన్నారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గతంలో పార్టీ చేసిన నిర్ణయాలను చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ప్యాకేజీల కోసం ప్రయత్నాలు జరిగాయని, అదే ప్రాజెక్టు దిశ మారడానికి కారణమైందని ఆరోపించారు. ఇప్పుడు అదే తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు.

పాలమూరు–రంగారెడ్డి అంశంపై స్పష్టత రావాలంటే సిట్ ఏర్పాటు చేయాలని, అలా చేస్తే తాను వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని కవిత సవాల్ విసిరారు. నీటి సమస్య అత్యంత సున్నితమైన అంశమని, బ్లేమ్ గేమ్‌తో రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్తు, బీఆర్ఎస్ మనుగడ కోసం కేసీఆర్ సభలోకి రావాలని కోరారు. కేసీఆర్ మాట్లాడితేనే నీటి సమస్యపై ప్రజల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు చేసినట్లే, కేసీఆర్ సభలోకి వస్తే ఆయనను ఎదుర్కొనే రాజకీయ స్థాయి ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించారు.

అలాగే హరీశ్ రావుకు ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపిస్తూ, సీఎం చాంబర్‌కు వెళ్లి ఆయనతో అర్థగంట మాట్లాడిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.