బంగ్లాదేశ్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కింది. మాజీ ప్రధాని, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా తాజాగా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన దేశాన్ని అమెరికాకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం యూనస్‌పై విదేశీ శక్తులతో చేతులు కలిపారన్న ఆరోపణలతో పాటు, ఉగ్రవాదుల సహాయంతో పాలన చేపట్టారని కూడా హసీనా పేర్కొన్నారు.
“నాకు అధికారంలో ఉండాలనే కాంక్షతో దేశ భూమిని అమ్మాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. మా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ సెంట్మార్టిన్ దీవిని అమెరికాకు అప్పగించేందుకు తిరస్కరించడంతోనే ప్రాణాలు కోల్పోయారు. అదే పరిస్థితి ఇప్పుడూ వస్తోంది” అని హసీనా ఒక సోషల్ మీడియా పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. యూనస్ పాలన దేశాన్ని ప్రమాదంలోకి నెట్టి పెడుతోందని ఆమె పేర్కొన్నారు.
ఇక యూనస్ పాలనలో ఉగ్రవాదులకు మళ్లీ అవకాశాలు పెరిగాయని, ప్రభుత్వం అప్పట్లో కఠిన చర్యలు తీసుకొని దేశాన్ని రక్షించిందని హసీనా గుర్తు చేశారు. “జైళ్లు ఖాళీ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు” అని హెచ్చరించారు.
అవామీ లీగ్‌పై విధించిన నిషేధం చట్టవిరుద్ధమని హసీనా స్పష్టం చేశారు. “ఈ మతలబు నాయకుడికి చట్టాన్ని తాకే హక్కు ఎక్కడిది? ఆయనకు ప్రజల మద్దతు లేదు. ఆయన పదవి రాజ్యాంగబద్ధంగా గుర్తించబడలేదు. అలాంటి వ్యక్తి చట్టాన్ని ఎలా మార్చగలడు?” అంటూ షేక్ హసీనా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కీలకంగా మారాయి.