దేవిశరన్నవరాత్రుల్లో ఆరోరోజు అక్టోబర్ 22న దుర్గాదేవిని కాత్యాయని దేవిగా ఆరాధిస్తారు. సింహవాహనంపై కరవాలం చేతబూని దుష్టసంహారకారిణిగా, జగద్రక్షణిగా విరాజిల్లుతుంది ఈ అవతారం. కాత్యాయనీ అవతారం ఎందుకు వచ్చిందంటే& పార్వతీదేవిని తనకు కుమార్తెగా జన్మించాలని కాత్యాయన మహర్షి తపస్సు చేశాడు. ఆయన అభీష్టం నెరవేర్చిన అమ్మవారు కాత్యాయనిగా రూపుదాల్చింది. కాత్యాయనిని దుర్గాదేవి అంశగా భావించి కొలిచిన వారికి సకల శుభాలను కలిగిస్తుంది తల్లి.
ధ్యానశ్లోకం
“చంద్రహాసోజ్జలకరా శార్దూలవరవాహన
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ॥”
సమర్పించాల్సిన నైవేద్యం:
నిండైన నారింజ రంగుతో చేసిన రవ్వకేసరి గానీ, పెసర పునుగులు గానీ నివేదనగా సమర్పించాలి. ఇవేకాకుండా షష్ఠి రోజు ప్రత్యేకంగా అన్నం, పప్పు దినుసులతో నైవేద్యం సమర్పిస్తుంటారు.
వేపకాయల బతుకమ్మ !
ఏడోరోజు బతుకమ్మను వేప (పాల)కాయల బతుకమ్మగా పిలుస్తారు. సకినాల బతుకమ్మగానూ ఆరాధిస్తారు. సాయంత్రం బతుకమ్మ ఆడిన తర్వాత సకినాలను అందరూ పంచుకొని ఆ రోజుకు కమ్మని ముగింపునిస్తారు.