మాల దీక్ష అనంతరం ఇరుముడి కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?

కార్తీక మాసం మొదలైంది అంటే చాలు పెద్ద ఎత్తున మనకు అయ్యప్ప మాలలు ధరించిన వాళ్ళు కనబడుతుంటారు. కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రాంతి వరకు నియమనిష్టలతో స్వామివారి మాలను ధరించి దీక్ష చేపడుతుంటారు.ఇలా 41 రోజుల పూర్తి అయిన అనంతరం స్వామి మాల ధరించిన వారు ఇరుముడితో స్వామి వారి కొండకు వెళ్లి స్వామిని దర్శించుకుని వచ్చిన అనంతరం వారిమాలను తొలగిస్తారు.

ఇలా మాల దీక్షలో ఉన్న సమయంలో ఎన్నో నియమనిష్టలను పాటిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చల్లనీటి స్నానం కటిక నేలపై నిద్రపోవడం, వారికోసం వంట చేసే వాళ్ళు కూడా ఎన్నో నియమాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. మాల ధరించిన వారు ఎటువంటి ఆగ్రహానికి గురికాకుండా నిత్యం అయ్యప్ప నామస్మరణంతో తోటి వారిని కూడా అయ్యప్ప అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలా కట్టిన దీక్ష అనంతరం మాల ధరించిన వారు ఇరుముడితో శబరి కొండకు వెళ్లడం జరుగుతుంది.

అయితే ఇలా ఇరుముడితో స్వామివారి ఆలయానికి వెళ్లడం వెనుక ఉన్న కారణం ఏంటి అసలు ఇరుముడిలో ఏం తీసుకువెళ్తారనే విషయానికి వస్తే… ఇరుముడులు అంటే రెండు ముడులు కలిగినదని అర్థం. ఆ రెండు భక్తికి శ్రద్ధకు ప్రతీకగా నిలుస్తాయి.ఇరుముడికి కట్టే తాడు ప్రణవం. భక్తి, శ్రద్ధలను సాధనతో పొందగలిగితే.. స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులోని ఆంతర్యం. ఇరుముడిలో ఒక భాగం దేవునికి సంబంధించిన సామాగ్రిని ఉంచుతారు.మరొక భాగంలో కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరును తొలగించి అందులో ఆవు నెయ్యిని వేస్తారు. ఆ నెయ్యితో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.ఇలా కట్టిన ఇరుముడితో భక్తులు కొండకు నడుచుకుంటూ వెళ్లి స్వామివారి సన్నిధిలో 18 మెట్లు దర్శించుకుంటారు.