ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్త దుబాయికి వెళ్ళాడు. ఒంటరిగా ఉంటున్న ఆ మహిళకు ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. చివరకు ఆ ప్రియుడి చేతిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన అన్నెపు కుశుమన్న, లక్ష్మీలకు 15 ఏండ్ల కింద వివాహం అయ్యింది. వారికి యోగానంద్, ధనలక్ష్మీ అనే పిల్లలున్నారు. కుశుమన్న మేస్త్రీ పని చేసేవాడు. కుటుంబం గడవడం కష్టం అవుతుండడంతో సంవత్సరం కింద దుబాయికి పనికి వెళ్లాడు. లక్ష్మీకి గ్రామానికే చెందిన భాస్కర్ రావు అనే యువకునితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. భాస్కర్ రావు నిత్యం లక్ష్మీ ఇంటికి వెళ్లివచ్చేవాడని తెలుస్తోంది. లక్ష్మీ భర్త కూడా గ్రామంలో లేకపోవడంతో వీరి సంబంధం సజావుగా సాగింది.
ఇటీవల భాస్కర్ రావుకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.ఈ విషయమై లక్ష్మీ, భాస్కర్ రావుకు గొడవ జరిగింది. అయితే భాస్కర్ రావు ఆమెను ప్లాన్ ప్రకారం శాంతింపజేశాడు. లింగాలవలస గ్రామంలోని కొండల వద్దకు కలుసుకుందామని రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లిన లక్ష్మీతో మంచిగా ఉన్నట్టుగానే నటించి తన కోర్కెను తీర్చుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీని ఊపిరాడకుండా గొంతు నులిమి చంపాడు. అక్కడే కొండల మధ్య ఉన్న బండరాళ్లలో లక్ష్మీ మృతదేహం వేసి పెట్రోల్ తో కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా గ్రామానికి వచ్చాడు.
రెండు రోజులైనా లక్ష్మీ ఇంటికి రావడంతో లక్ష్మీ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామస్థులు భాస్కర్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడని గ్రామస్థులు చర్చించుకున్నారు.