రైలు మనుషులు ప్రయాణించటానికో సరుకులు రవాణా చేయటానికో ఉపయోగిస్తారు. కానీ కొంతమందికి రైలు బోగీలు బెడ్ రూములుగా మారిపోయాయి. గూడ్స్ రైళ్లలో సరుకుని అన్లోడ్ చేశాక బోగీలను తమ విశ్రాంతి గదులుగా వాడుకుంటున్నారు కొందరు ఆకతాయిలు. విశ్రాంతి తీసుకుంటే ప్రాబ్లెమ్ ఏముంది అంటారేమో కానీ వాటిని బార్ షెడ్లుగా ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ విజయవాడలోని కే.ఎల్.రావునగర్ గూడ్స్ యార్డులో జరిగే తంతు ఇది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేరు వేరు ప్రాంతాల నుండి కార్గో లోడ్ తో వచ్చిన గూడ్స్ బోగీలను కే.ఎల్.రావునగర్ గూడ్స్ యార్డుకు తీసుకొచ్చి సరుకును అన్లోడ్ చేస్తారు. తిరిగి కార్గో లోడ్ నింపే వరకు ఆ బోగీలు ఖాళీగా యార్డులోనే ఉంటాయి. ఆ బోగీలు ఖాళీగా ఉండటం, జనసంచారం తక్కువగా ఉండటం, చుట్టు తుప్పలు, నైట్ సెక్యూరిటీ లేకపోవటం, పోలీసుల గస్తీ కూడా లేని కారణంగా వ్యసన పరులకు అడ్డాగా మారిపోయింది. ఆ యార్డులో రైల్వే కూలీలు విశ్రాంతి తీసుకోవటానికి ఒక షెడ్ ఏర్పాటు చేసారు రైల్వే అధికారులు. కే.ఎల్.నగర్, చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆ షెడ్ ని బార్ గా, ఖాళీ బోగీలను కామవాంఛలు తీర్చుకునే పడక గదులుగా ఉపయోగించుకుంటున్నారు.
అక్కడ పార్టీలు చేసుకుంటూ మహిళలను తీసుకొచ్చి వారు స్పృహ కోల్పోయేవరకు మందు తాగించి ఆ ఖాళీ బోగీల్లో వ్యభిచార కార్యకలాపాలు నెరపుతున్నారు. తాజాగా నలుగురు యువకులు ఒక మహిళను తీసుకొచ్చి ఆమెకు ఫుల్ గా మందు తాగించారు. ఆమె స్పృహ కోల్పోయాక నలుగురు యువకులు ఒకేసారి ఆమెను ఖాళీ బోగీలోనికి తీసుకెళ్లి చాలాసేపటి వరకు బయటకు రాలేదు. ఆమెను హత్య చేశారేమో అని అనుమానం వచ్చిన స్థానిక మహిళలు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ యువకులు అక్కడి నుండి జంప్ అయ్యారు. ఆ మహిళ మాత్రం స్పృహ కోల్పోయి బోగీలో పడి ఉంది. అనునిత్యం ఇలాంటి అసాంఘిక చర్యలు అక్కడ జరుగుతుండటంతో యార్డుకి దగ్గరలో నివసించేవారు ఆందోళన చెందుతున్నారు.
కే.ఎల్.రావునగర్ గూడ్స్ యార్డు, రైల్వే ట్రాక్ ఆర్పీఎఫ్ పరిధిలో ఉన్నా ఆర్పీఎఫ్ పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు. గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులు కనిపించి వారిని ప్రశ్నిస్తే, వారు కొంత డబ్బులు చేతిలో పెట్టగానే సైలెంట్ అయిపోతున్నారని వెల్లడిస్తున్నారు. కే.ఎల్.రావునగర్ గూడ్స్ యార్డులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి మా దృష్టికి కూడా వచ్చాయని తెలుపుతున్నారు కొత్తపేట ఎస్సై. అయితే అది మా పరిధిలో లేదని, నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసే అధికారం ఆర్పీఫ్ అధికారులకే ఉందని చెప్పారు. చుట్టుపక్కల వారు ఈ విషయాన్నీ మా దృష్టికి తెచ్చినప్పుడు మేము దీని గురించి ఆర్పీఫ్ ఉన్నతాధికారులతో వివరించమని ఆయన అన్నారు.