విజయవాడ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వంగవీటి రాధా ఇక రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు కూడా ఈ విషయాన్ని కొంతవరకు అంగీకరిస్తుండటంతో, ఇది త్వరలోనే అధికారికంగా ప్రకటించొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రంగా వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రాధా, ఎన్నో అంచనాలతో ముందుకు వెళ్లినా, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రయాణం అంత మజిలీగా సాగలేదనే చెప్పాలి.
తనకు తగిన ప్రాధాన్యత, పదవులు లభించడం లేదనే ఆవేదన రాధాలో కనిపిస్తుందని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ పార్టీల్లో ప్రయోగాలు చేసిన ఆయన, ఎక్కడా స్థిరంగా నిలవలేకపోయారు. దీని ప్రభావంతో ప్రజల్లో తన ఓటు బ్యాంకు కూడా క్రమంగా దూరమవుతోందనే విశ్లేషణ ఉంది. ఈ అనిశ్చితి పరిస్థితులు, తనకు రాజకీయంగా సరైన స్థానం లభించకపోవడం వల్లనే రాధా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
రాధా రాజకీయాల నుంచి విరమించుకోవడానికి కుటుంబ పరమైన కారణాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని, అందువల్ల రాజకీయాలపై మరింత దృష్టి పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఇక ముందు కుటుంబంపై పూర్తి దృష్టి సారించాలని భావించిన రాధా, రాజకీయ జీవితం ముగించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ పరిణామంతో విజయవాడలో వంగవీటి రంగా పేరు మాత్రం రాజకీయంగా మిగిలే అవకాశం ఉంది. రాధా రాజకీయంగా మార్గాన్ని వదిలేయడం, ఆయన అనుచరులు తదుపరి ఏ దిశగా సాగుతారనేది ఆసక్తికరంగా మారింది. అధికారికంగా ఈ విషయంపై రాధా నుంచి ప్రకటన వస్తే, ఇది విజయవాడ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది.


