భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి ఇంట్లోనే మరొకరితో…

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నంతలో అన్యోన్యంగా బాగానే ఉన్నారు. వారికి లిఖిత, నిఖిత అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కానీ తన భార్య వేరొకరితో చనువుగా ఉంటుందని భర్త అనుమానించాడు. అది కూడా తనను సినీ ఫక్కీలో మోసం చేస్తుందని గ్రహించాడు. చివరకు ఆమెని హతమార్చాడు.  ఇంతకీ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫత్తేబాద రాఘవాచారి వీధిలో రాంబాబు, నాగలక్ష్మీ అనే దంపతులు అద్దె ఇంట్లో ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. రాంబాబు ఓ హోటల్ లో, నాగలక్ష్మీ ఓ రెస్టారెంట్ లో పని చేసేవారు. భార్య భర్తల మధ్య గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. రాంబాబు పిల్లలను తన తల్లి వద్ద ఉంచి భార్య భర్తలు మాత్రమే ఏలూరులో ఉంటున్నారు. అయితే తన భార్యకు ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని రాంబాబుకు తెలిసింది. అది కూడా రోజు రాత్రి తనకు నిద్రమాత్రలు ఇచ్చి ఆ తర్వాత మరో వ్యక్తితో ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని రాంబాబు ఆరోపిస్తున్నాడు.

ఈ క్రమంలో తన అనుమానాన్ని నిజం చేసుకోవడానికి సోమవారం రాత్రి రాంబాబు తన భార్య నాగలక్ష్మీ ఇచ్చిన నిద్రమాత్రలు వేసుకున్నట్టుగా నటించి నిద్రపోయినట్టు చేశాడు. ఇంతలో ఓ వ్యక్తి ఇంట్లోకి రాగానే నాగలక్ష్మీ అతనితో సన్నిహితంగా వ్యవహరించింది. రాంబాబు లేవగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాంబాబు పక్కనే ఉన్న రోకలిబండతో భార్య తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పి రాంబాబు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న స్థానికులు పలు రకాలుగా చర్చించుకున్నారు. చాలా అమాయకంగా కనిపించే నాగలక్ష్మీ ఇలా చేసిందా అని అనుకున్నారు. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరో తెలిస్తేనే అసలు నిజాలు బయటపడుతాయని పోలీసులు అంటున్నారు.