ఏడుకొండలవాడి ‘వెండి’ సమస్య… ఏమిటో తెలుసా?

తిరుమల శ్రీవారికి కానుకలు ఎన్ని రూపాలలో వస్తూంటాయో చెప్పనవసరం లేదు. నగదు,బంగారు,వెండి,వాహనాలు, తలనీలాలు… ఇలా ఎన్నిరూపాలో చెప్పటం కష్టం. భక్తులు శ్రీవారికి మొక్కులు ఏరూపంలో చెల్లించాలనే దానిమీద  ఆంక్షలు లేవు. అందువల్ల రకరకాలుగా తిరుమలేశుడికి కాన్కలొస్తుంటాయి. వీటన్నింటిలో విశిష్టమయినవి బంగారు, వెండి కానుకలు. ఈకానుకలు చివరకు ఏమవతాయనేదానికి గురించి చాలా మందికి తెలియదు. కానుకలిచ్చిన భక్తులకు కూడా తెలియదు.  తిరుమల ఆలయం అంతా మిస్టరీ. అక్కడే పూజలు ఎన్నిరకాలో,ప్రసాదాలు కూడా అంతే.సాధారణ ప్రజలకు తెలియని ప్రసాదాలు కూడా ఉంటాయి.  తిరుమల గుట్టువిప్పాలంటే మహాభారతమంత పుస్తకమవుతుంది. ఇపుడు తిరుమలేశుడికి వచ్చే వెండిని ఒక సారి చూద్దాం.

ఈ వెండి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, వేంకటేశ్వరుడికి భక్తులు ఇచ్చిన వెండి చర్చనీయాంశమయింది. ఆ వెండిని ఏమి చేయాలో ఆయన పాలకులకు అర్థంకావడం లేదు. దీనితో వెండి గుట్టలుగుట్టలుగా పేరుకుపోయింది. సాధారణంగా ఈ వెండిన ఆభరణాలను కరిగించి ఏదో ఒక రూపంలో మళ్లీ భక్తులకువిక్రయించాలి. ఈ ప్రక్రియ ఆగిపోవడంతో వెండి కొండల పెరిగిపోవడంతో వెండి చర్చ మొదలయింది. ఇపుడు ఏ పరిస్థితి వచ్చిందంటే, ఈ వెండిని కరిగించాలంటనే కోట్ల రుపాయలు అవసరమవుతాయని తిరుమల వ్యవహారాల మీద వ్యాఖ్యానించే  ధర్మచక్రం వెబ్ సైట్ పేర్కొంది.

ఏటా వెంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా ఏడాదికి రెండు టన్నలు దాకా వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కానుకలుగా సమకూరుతుంటాయి.

సాధారణంగా ఈ వెండి ఆభరణాలను ప్రభుత్వ టంకశాలలో కరిగించి, నాణ్యమైన వెండిగా శుద్ధిచేసి, వాటితో శ్రీవారి డాలర్లు (3 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు) తయారు చేసేవారు.. కరిగించడం, శుద్ధిచేయడంలో తరుగు 32 శాతం దాకా చూపుతున్నారని, ఇందులో ఎదో తిరకాసు ఉందని ఆరోపణలుకూడా వచ్చాయి, దీనితో  డాలర్లు తయారీని నిలిపివేశారు. ఇక మిగిలింది వేలం వేయడమే.2013లో 3 టన్నుల ఆభరణాలను రెండు పర్యాయాలు వేలం వేసేందుకు ప్రయత్నిస్తే పెద్దగా స్పందన రాలేదని చెబుతారు. 2016లో అప్పటి ఇవొ సాంబశివరావు వెండి విక్రయానికి మరొక ప్రయత్నం చేశారు. ఇండియన్‌ మింట్‌కు  అప్పగించాలని, కరిగించిన తర్వాత వచ్చేశుధ్దమయిన వెండికి సమానమయిన ధరలో బంగారును టిటిడికి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. అప్పటికి టిటిడి వద్ద 28 టన్నుల వెండి ఆభరణాలున్నాయి. ఇందులో  17,775 కిలోలను హైదరాబాద్ మింట్ కు అప్పగించారని చెబుతారు. ఇదింకా నడుస్తూనే ఉంది. ఇక అటువైపు భక్తులనుంచి వెండి ఆభరణాల కానుకలు వస్తూనే ఉన్నాయి.  2016 జనవరి నుంచి ఇప్పటిదాకా మరొక  7 టన్నుల దాకా వచ్చి చేరింది.అంటే, మింట్ కు అప్పగించినా, మరొక  18 టన్నుల వెండి ఆభరణాలు జమఅయ్యాయి.

అయితే ఇపుడు టిటిడికి మరొక సంకటం ఎదురయింది.

  వెండి ఆభరణాలను కరిగించి, శుద్ధిచేసి, ఆపైన మిగిలిన స్వచ్ఛమయిన వెండి విలువకు సమానమైన బంగారు ను ఇవ్వాలి. అయితే,  వెండి ని కరిగించేందుకు  అయ్యే టిటిడిని భయపెట్టింది. టిటిడి వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, కిలో వెండి ఆభరణాలను కరిగించడానికి రూ.1000, శుద్ధి చేయడానికి రూ.2,400 ఖర్చువుతాయి. ఇది టిటిడే భరించాలి. . అంటే కిలో ఆభరణాల మీద  రూ.3,500 ఖర్చు అవుతుంది.  తన దగ్గిర ఉన్న వెండిని కరిగించి, శుద్ధి చేయించడానికి టిటిడి రూ.12.25 కోట్లు ఖర్చు చేయాలి. ఇపుడు ఈ ప్రాసెస్ జోలికి వెళ్లకుండా వెండి ఆభరణాలను కరిగించి, శుద్ధి చేయకుండా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని భావించి ఈ  మేరకు భారత ప్రభుత్వం సంస్థ అయిన ఎంఎంటిసి తో ఎంవొయు చేసుకుంది. అగ్రిమెంటుప్రకారం వచ్చిన మొత్తం 0.75 శాతం కమిషన్ గా ఎంఎంటిసికి ఇవ్వాలి.

ఇలా వెండి కానుకలు తిరుమలేశుడి దగ్గిర పేరుకుపోతున్నాయి. వీటిని వల్ల స్వామి వారికి ఒక్క పైసా ఆదాయం రావడం లేదు. నిజానికి ఏదో ఒక విధంగా ఈవెండిని కరిగించి అమ్మేసి, వచ్చిన డబ్బును బ్యాంకులలో డిపాజిట్ చేసి ఉంటే కోట్ల రుపాయల వడ్డీ రాబడి ఉండేంది. ఇపుడు ఈ వడ్డీలేదు, నిల్వలు పేరుకు పోయి ‘వెండి’ తలనొప్పి మొదలయింది. ఇంత పెద్ద పాలక మండలి ఉండి ఈ వెండిని ఏమిచేయాలో తెల్చేలేకపోతున్నారు. ఇటీవల  శ్రీకాళహస్తి దేవస్థానం  వెండిని చాలా సులభంగా విక్రయించింది. దాదాపు 14,000 కిలోల వెండి నాగపడగలను కరిగించి వేలం వేసి, వచ్చిన డబ్బుతో 150 కిలోల బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి శ్రీకాళహస్తీశ్వరుని పేరుతో బ్యాంకులో జమ చేసింది.

ఇలాంటిది టిటిడిలోజరుగడంలేదు.  ఇపుడు టిటిడి వద్ద ఉన్న  వెండిని కరిగించి విక్రయిస్తే  దాదాపు 400కిలోల బంగారు వస్తుందని చెబుతున్నారు.  మరి అదిఎపుడు నిజమవుతుందో చూడాలి.