ఒక అమ్మాయిని చూపించి మరొక అమ్మాయితో చేశారని…

పెళ్లి కోసం వేసిన పందిరి ఇంకా చెదరనే లేదు. మండపంలో కొత్త జంటకు పలికిన ఆశీర్వచనాలు మరువనే లేదు. పచ్చని తోరణాలు ఆరనే లేదు. అప్పుడే ఆ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని చూపించి మరో అమ్మాయితో వివాహం జరిపించారని పెళ్లి అయిన రెండు రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరంలోని బాబామెట్టాలో ఈ సంఘటన జరిగింది.

బాబామెట్టకు చెందిన ఎస్ కే మదీన్ చీపురుపల్లి మండలంలోని పెదనడపల్లిలో వీఆర్ వో గా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. తాజాగా బ్యాంకు ఉద్యోగ పరీక్షలోనూ విజయం సాధించాడు. ఈ లోగా అతని తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధం చూశారు. సాలూరుకు చెందిన మహ్మాద్ మోబీనాతో వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 2న విశాఖపట్నం లో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుక అనంతరం 3న విజయనగరం చేరుకున్నారు. 4న విందు జరగాల్సి ఉంది. ఈ లోగా మదీన్ కనిపించకుండా పోవడంతో అంతటా వెతికారు. చివరకు వారి పాత ఇంట్లో మదీన్ అచేతనంగా పడి ఉన్నాడు. మదీన్ మరణంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

ఒక అమ్మాయిని చూపించి మరో అమ్మాయితో వివాహం జరిపించారని తాను మోసపోయాననే బాధతోనే మదీన్ ఆత్మహత్య చేసుకున్నట్టు పలువురు చెబుతున్నారు. వరుడికి, కుటుంబ సభ్యులకు ముందుగానే అమ్మాయిని చూపించి వారి ఇష్టంతోనే వివాహం నిశ్చయించామని వధువు బంధువులు అంటున్నారు.