ఆంధ్రాలో నడుస్తున్న రాజకీయాలు సామాన్యులకు అంతుచిక్కని విధంగా ఉన్నాయి. ఎవరు ఎవరి మీద ఎందుకు పోట్లాడుతున్నారో జనానికి అర్థంకావట్లేదు. అందరిలోకి టీడీపీ ముఖమే కాస్త స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్టాండ్ క్లియర్ గా ఉంది. ఆయన జగన్ సర్కారును కూల్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే బీజేపీ, జనసేనల పొత్తును ఆశిస్తున్నారు. 2024 ఎన్నికలకు బీజేపీతో చెలిమి చేసుకుని కలిసికట్టుగా జగన్ ను ఒంటరిని చేసి 2014నాటి పరిస్థితుల్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నారు. అందుకే వారి కోసం తపించిపోతున్నారు. ఈ సంగతులు రాష్ట్రంలో ఎవ్వరినడిగినా చెప్తారు. ఎటొచ్చీ అర్థంకానిది బీజేపీ, జనసేన, వైసీపీ వ్యూహాలే.
బీజేపీ కేంద్ర స్థాయిలో జగన్ తో మచ్చికగా ఉంటుంది.. రాష్ట్రంలో మాత్రం అడపాదడపా విమర్శలు చేస్తూ ఉంటుంది. అలాగని రాష్ట్రానికి చేయాల్సిన మేలును తేడా లేకుండా చేస్తోందా అంటే అదీ లేదు. జగన్ సైతం తనకున్న అవసరాల రీత్యా బీజేపీని పెద్దగా టచ్ చేయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి సొంత ఎజెండాను స్పష్టంగా ఫాలోకాలేకపోతున్నారు. ఇలా మూడు పార్టీలు ఒకే దారిలో నడుస్తూ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కానీ వీరి ముగ్గురి విషయంలో ఒక సంగతి మాత్రం ఖచ్చితమన్నట్టు కనిపిస్తోంది. అదేమిటంటే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనేది బీజేపీ లక్ష్యం. అందుకోసమే వైసిపీ, జనసేనలతో కలిసి మూకుమ్మడిగా చంద్రబాబును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తోంది.
దీన్నే జగన్ ఆసరాగా చేసుకుని బీజేపీ వద్ద పబ్బం గడుపుకుంటున్నారు. నిజానికి జగన్ స్థాయిని అంత తగ్గాల్సిన పనిలేదు. కానీ తగ్గారు. ఈ తగ్గును అవకాశంగా తీసుకుని బీజేపీ తోకజాడించాలని చూస్తోంది. ఒకవేళ వీలుచిక్కి జాడించిందో జగన్ విశ్వరూపం చూపెడతారు. రాష్ట్రం లేదు కేంద్రం లేదు రెండు చోట్లా వారిని ధిక్కరిస్తారా. జగన్ ధిక్కరణ ఢిల్లీలో పనిచేయకపోవచ్చు కానీ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఆయన పనిగట్టుకుని బీజేపీ తరిమికొట్టాలి అనుకుంటే ఇన్నాళ్లు టీడీపీ మీద పెట్టిన దృష్టిని బీజేపీ మీదికి మారుస్తారు. ఎక్కడికక్కడ పార్టీని ముక్కలు చేసి ప్రతిపక్షం కాదు కదా కనీసం ఒక పార్టీలా కూడ ఉండనివ్వరు. అప్పుడు ఎప్పటిలానే చంద్రబాబే ప్రతిపక్షంగా కొనసాగుతూ ఇంకాస్త బలపడే ఛాన్సుంది.