చరిత్రకు రెండే రోజులు..జగన్ @ 3648 కి. మి

అవును మరో రెండు రోజుల్లో దేశ రాజకీయ చరిత్రలోనే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నూతనచరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 2017, నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలో మొదలైన ప్రజా సంకల్పయాత్ర 2019, జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ముగుస్తోంది. అంటే దాదాపు 14 నెలల పాటు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోనే గడిపారన్నమాట. జనాల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే నేరుగా జనాలతో మమేకమవ్వటం ఒకటే మార్గమని జగన్ నమ్మారు. దానికితోడు తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చూపించిన మార్గదర్శనం ఎలాగు ఉండనే ఉంది. అందుకే జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

సొంత నియోజకవర్గం పులివెందులలోని ఇడుపులపాయలో చిన్న కాలువ లాగ మొదలైంది పాదయాత్ర. జిల్లాదాటి కర్నూలోకి ప్రవేశించి ముగిసేనాటికి పాదయాత్ర కాలువంతైంది. తర్వాత అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పూర్తయ్యేటప్పటికి కాలువలాగున్న పాదయాత్ర కాస్త చిన్న సైజు నదిలాగ తయారైంది. ఇక రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకుని కోస్తా జిల్లాలైన నెల్లూరులో పూర్తయ్యేనాటికి పెద్ద నదిలాగ తయారైంది. అక్కడి నుండి ప్రకాశం జిల్లాను దాటుకుని గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పూర్తి చేసుకునేనాటికి నదే మరింత విశాలమైంది.

ఇక ఉభయగోదావరి జిల్లాలను దాటే సమయానికి సముద్రంలాగ రూపాంతరం చెందింది. అక్కడి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారమైన విజయనగరం జిల్లా, తర్వాత విశాఖపట్నం దాటి చివరకు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించేనాటికి జనసంద్రంలాగ కనిపిస్తోంది. మొత్తానికి మరో రెండు రోజుల్లో అంటే జనవరి 9వ తేదీన జిల్లాలోని ఇచ్చాపురం బహిరంగ సభతో ప్రజాసంకల్పయాత్ర పూర్తవుతోంది. దేశచరిత్రలోనే సుమారుగా 3670 కిలోమీటర్లు నడిచిన నేత ఎక్కడా కనిపించరు. ఏపిలో అయితే బహుశా ఈ రికార్డును బద్దలు కొట్టటం సమీప భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.

తెలుగురాష్ట్రాల్లో పాదయాత్ర కాన్సెప్టు మొదలుపెట్టిందే వైఎస్ఆర్. 2003 ఎన్నికలకు ముందు సుమారు ప్రజా ప్రస్ధానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా వస్తున్న మీ కోసం అనే పేరుతో 117 రోజుల పాటు సుమారు 2 వేల కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత జగన్ సోదరి వైఎస్ షర్మిల 3 వేల కిలోమీటర్లు ప్రజాప్రస్ధానం పేరుతో పాదయాత్ర చేశారు. అంటే అప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్నారు లేండి. అందుకనే పాదయాత్ర మొత్తాన్నే షర్మిలే పూర్తి చేశారు. మళ్ళీ తాజాగా జగన్ మొదలుపెట్టారు.

పాదయాత్ర చేసిన నాలుగో నేతే అయినప్పటికీ జగన్ ఏకంగా 3700 కిలోమీటర్లు నడవటమే పెద్ద రికార్డు. 341 రోజుల్లో 134 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేశారు. 2516 గ్రామాల్లో యాత్రను పూర్తి చేశారు. 124 బహిరంగసభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కడప, రాజమండ్రిలో జరిగిన బహిరంగసభల్లో జనాలు పోటెత్తారు. పై రెండు ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో హాజరైనప్పటికన్నా ఇచ్చాపురం బస్టాండ్ దగ్గర జరుగనున్న ముగింపు బహిరంగసభకు మరింత ఎక్కువమంది జనాలు హాజరయ్యే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర దేశ చరిత్రలో ఓ రికార్డేనని చెప్పాలి.