వెంట్రుక రాజకీయం: తన స్థాయిని తానే తగ్గించుకుంటున్న వైఎస్ జగన్.!

YS Jagan

ఎంతమంది కుట్రలు పన్నినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు..’ అని వైసీపీ నేతలెవరైనా అంటే, దాన్ని తప్పు పట్టలేం. అది అధినేత మీద వారికున్న నమ్మకం.. అని సరిపెట్టుకోవచ్చు. కానీ, ‘వెంట్రుక పీకలేరు’ అన్న మాట స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.. అదే మాట ఆయన మళ్ళీ మళ్ళీ అంటోంటే.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధారణ రాజకీయ నాయకుడేమీ కాదు. ఆయన బాధ్యతగల పదవిలో వున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయన. రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి అధికారిక వేదికలపై మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి. అందునా, మహిళలు అలాగే చిన్న పిల్లలు హాజరవుతున్న అధికారిక కార్యక్రమాల్లో మరింత హుందాగా వ్యవహరించాలి.

కానీ, వైఎస్ జగన్ తన మాట మీద అదుపు కోల్పోతున్నారు. విపక్షాల్ని నిలదీసే క్రమంలో, వాడకూడని మాటలు వాడుతున్నారు. ‘వెంట్రుక కూడా పీకలేరు..’ అనడం అంత సాధారణమైన మాటేమీ కాదు. మహిళల్ని బలవంతంగా ముఖ్యమంత్రి సభలకు లాక్కొస్తున్నారుగానీ, వాళ్ళ యెదుట ఇలాంటి మాటలు మాట్లాడితే.. వాల్ళెందుకు అక్కడ వుంటారు.? అందుకే, ఎంతలా వారిస్తున్నా.. ఎక్కువసేపు వైఎస్ జగన్ ప్రసంగం వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు.

రాజకీయాల్లో ఎవరూ ఎవరి వెంట్రుకలూ పీకలేరు. ఇది అసలు వాడకూడని భాష. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు.. సరే, ఓట్లను కరెన్సీ నోట్లతో కొనేయడం.. అనేది వేరే చర్చ. అధికారం పోతే, వ్యవస్థలూ వెక్కరిస్తాయ్. అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోకపోతే ఎలా.? వచ్చే ఎన్నికల్లో ఇంకోసారి అధికారంలోకి రావాలంటే, ముందుగా వైఎస్ జగన్ తన భాషని మార్చుకోవాల్సి వుంటుంది.