పవన్ ఇపుడున్న రాజకీయాల్లో మార్పు తెస్తాడా?

(మల్యాల పళ్లంరాజు)

చిరు గాలిగా ఆరంభమైన పవన్ కల్యాణ్ జనసేన.. ప్రభంజనంగా మారుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైఎస్ ఆర్ సీపీలకు దీటుగా, బలమైన శక్తిగా మారుతోంది. ప్రశ్నించే వేదికగా ఐదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ ఆరంభించిన జనసేన అతి త్వరలోనే అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.  జనంలో రాజకీయ చైతన్యం పెంచేందుకు అక్టోబర్ 15న  విజయవాడలో సాగిన పవన్ కల్యాణ్  మహా ర్యాలీ… అధికార, ప్రతిపక్ష పార్టీలకు.. చెమటలు పట్టించింది. అనూహ్యంగా అప్రతిహతంగా దాదాపు ఐదు లక్షల మందికి పైగా జన వాహనితో  సాగిన ర్యాలీని అద్భుతం అని వర్ణిస్తే.. అది చిన్నమాట అవుతుంది. జన సంద్రం …ప్రభంజనంలా వచ్చి తమ ప్రియతమ నాయకుడికి మద్దతు తెలిపారు. ప్రేమాదరణలు వర్షించారు.

పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తిస్తూ,  భారత ఎన్నికల కమిషన్ 2014 డిసెంబర్ 11న ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో జనసేన పార్టీ ఏ ఎన్నికలలోనైనా పోటీ చేసేందుకు ఆమోదం లభించింది. 2014 ఎన్నికలలో జనసేన తెలుగుదేశం, బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు తెలిపి, ఆ కూటమి తరుపున ప్రచారం సాగించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ తెలిసినవే.

   ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన తొందరపాటు నిర్ణయాలు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్  కొత్తగా

ఏర్పడిన  రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి నాయకత్వం అవసరమని నమ్మి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ, తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన క్రమంలో చేసిన తప్పిదాలు, పొరపాటు నిర్ణయాలు, పెచ్చరిల్లిన అవినీతిని పవన్ కల్యాణ్ సహించలేక పోయారు. అదే సమయంలో  జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రతిపక్షం పూర్తి వైఫల్యాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీతి, నిబద్ధత గల సమర్థవంతమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు స్వయంగా రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు గడించి పెడుతున్న చిత్రపరిశ్రమలోని ఆఫర్లను కాదని, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే మహా వేదికగా జన సేనను తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం చేసి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ, దూసుకు పోతున్నారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తూ, సాధ్యమైనంతమంది ప్రజలను కలిసి వారి సమస్యలు ఆలకిస్తూ, పరిష్కారాలను అన్వేషిస్తూ అడుగులు వేస్తున్నారు.

   పవన్ కల్యాణ్  రాజకీయ ప్రస్థానంలో ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు.   చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మిపార్టీ, పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ఖాన్  తాహరిఖ్ పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీల పట్ల పూర్తి అవగాహన పెంచుకుని, ఆయా పార్టీలకు భిన్నంగా, జనసేనను రూపు దిద్దుతున్నారు.

    పాకిస్తాన్ లో..1990 దశకం చివర్లో ఆరంభమైన ఇమ్రాన్ ఖాన్  పార్టీ ఆరంభంలో ఒక్క సీటు గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే ఒకే సీటులో నెగ్గాడు. అయినా పార్టీని కాపాడుకుంటూ,  విస్తృత స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసుకుంటూ, ఉద్యమాలతో దేశంలో తన ఉనికిని చాటుకుంటూ, 2018లో ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడన్నది చారిత్రక సత్యం.

   పవన్ కల్యాణ్ కూడా అదే బాటలో సాగుతున్నాడు. ఓర్పు, సహనంతో అన్నివిషయాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవడంతో పాటు, ప్రజాసమస్యలను పూర్తిగా ఆలకిస్తూ, వారి సమస్యలకు వీలైనంత మేరకు పరిష్కారాలను సూచిస్తూ, మరో పక్క వ్యూహాత్మకంగా జన సైనికులను  ప్రోది చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ ను ఏర్పాటు చేయడంతో పాటు, వారంతా ప్రజా సమస్యలపై పోరాడే విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో దాదాపు 125 పైగా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, లక్షలాది మందిని పార్టీ సభ్యులుగా చేర్చడంతో పాటు, చురుకైన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి బలమైన శక్తిగా జనసేనను తీర్చి దిద్దుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో  గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ గలిగిన నాయకులు. ప్రస్తుత తరుణంలో పవన్ కల్యాణ్ ప్రజాకర్షణ, ప్రజలను తన మాటలతో ప్రభావితం చేసే ఏకైక నాయకుడుగా ఎదిగారు.

 

2016 నవంబర్ లో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేన పార్టీ స్వతంత్రంగా 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు.2019 ఎన్నికలలో పార్టీ మేని ఫేస్టోలో పొందు పరచాల్సిన అంశాలను ప్రజలే సూచించాలని కోరుతూ, వారి సూచనలు అందుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించారు. నాగార్జున వర్సిటీ సమీపంలో 2018 మార్చి 14న  జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఏడాది మే 2న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసేవిధంగా పార్టీని సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించి, ఆ నాటి నుంచి నిద్రాహారాలు మాని పార్టీ బలో పేతానికి అవిరణ కృషి చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ లో విప్లవాత్మకమైన మార్పు రావాలి. విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్  ఇప్పటికీ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. సమర్థుడని గద్దెకెక్కిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో కుల పరమైన ఆలోచన చేయడమే కాక, అవినీతి అక్రమాలకు గేట్లు తెరిచారు. ఆశ్రిత పక్షపాతం, కొడుకును ప్రమోట్ చేయడం చంద్రబాబు సామర్థ్యాన్ని కప్పేశాయి.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో నాలుగున్నర ఏళ్లు అంటకాగి, కేంద్ర మంత్రి పదవులు పొంది, తమ ఆస్తులు పెంచుకున్నారే ప్రత్యేక హోదా సాధించలేదు. ఒప్పుకున్న ప్యాకేజీలు రాబట్టలేదు. పట్టిసీమ, పోలవరం కాంట్రాక్టుల్లో కోట్లాది రూపాయలు స్వాహా అయినట్లు ఆరోపణలు వచ్చాయి. భూ కబ్జాలు, ఇసుక వ్యాపారంతో టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ వ్యవస్థను సమూలంగా మార్చే శక్తి కావాలి.  1983లో ఎన్టీ రామారావు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ఉన్న ప్రభుత్వాలను సమూలంగా తుడిచి పెట్టి, కొత్తగా సమర్థవంతమైన, నీతితో కూడిన పాలన అందించే సత్తా ఉన్న సర్కార్ రావాలి. ప్రజా ప్రభంజనంతో దూసుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ అలాంటి సమర్థుడుగా తనను తాను నిరూపించుకోవాలి. విప్లవాలకు ప్రతీకగా నిలిచిన చే గువేరాను ఆదర్శంగా నిలుపుకున్న పవన్ కల్యాణ్ వినూత్న విప్లవం సాధిస్తాడనే ఆశిద్దాం.

 

(మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)