Janasena : బీజేపీతో కటీఫ్‌కి సిద్ధమవుతున్న జనసేన పార్టీ.!

Janasena : జనసేన పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు రాబోతున్నాయా.? ‘పాచిపోయిన లడ్డూలు..’ అంటూ గతంలో బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మళ్ళీ అలాంటి విమర్శలు చేయడానికి సంసిద్ధమవుతున్నారా.? ఔననే అనిపిస్తోంది తాజా పరిణామాల్ని చూస్తోంటే.

నిన్న విజయవాడలో జనాగ్రహ సభ పెట్టుకుంది బీజేపీ. అధికార వైసీపీ మీద విమర్శలు చేస్తూ పబ్బం గడిపేసుకున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీగా వున్న బీజేపీ, అధికార వైసీపీ మీద విమర్శలు చేయడం మామూలే. కానీ, మిత్రపక్షం జనసేన మీద సెటైర్లు వేయడమేంటి.? ఇదే జనసేన నేతలకు ఒళ్ళ మండేలా చేస్తోంది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విశాఖ స్టీలు ప్లాంటు విషయమై జనసేన చేస్తున్న ఆందోళనలపై ఎగతాళి చేశారు. దాంతో, జనసేన నేతలూ కౌంటర్ ఎటాక్ ఇవ్వక తప్పలేదు. సోము వీర్రాజు అసహనంతో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారనీ, జనసేనతో తెగతెంపులు చేసుకోవాలనే ఆలోచన బీజేపీకి వున్నట్టే కనిపిస్తోందనీ జనసేన నేతలు అంటున్నారు.

ఏపీలో బీజేపీ – జనసేన.. పేరుకే మిత్రపక్షాలు. అవసరమైనప్పుడు జనసేన సహకారం బీజేపీ తీసుకుంటోంది తప్ప, జనసేనకు ఏనాడూ బీజేపీ సహకరించింది లేదు. జనసేన కంటే కొద్దో గొప్పో వైసీపీకే సహకరిస్తోంది బీజేపీ. వైసీపీ ఎలాగూ బీజేపీకి సహకరిస్తోందనుకోండి.. అది వేరే సంగతి.

ఎలా చూసినా బీజేపీ వల్ల తమకు లాభం లేదనే విషయం జనసేనకు ఎప్పుడో అర్థమైపోయి వుండాలి. సరైన సమయం వస్తే, బీజేపీకి జనసేన చెక్ పెట్టడం ఖాయమే. మొత్తమ్మీద బీజేపీతో కటీఫ్‌కి జనసేన సిద్ధంగా వున్నట్లే భావించాల్సి వుంటుంది.