గెంటితే కానీ వెళ్ళేట్లు లేరే ?

తెలుగుదేశంపార్టీ హయాంలో నియమితులైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, సలహాదారులు ఇంకా తమ పదవులను పట్టుకుని ఊగుతునే ఉన్నారు. ప్రభుత్వం మారగానే నామినేటెడ్  పదవులకు రాజీనామాలు చేయటం అన్నది నైతికతకు సంబంధించిన అంశం. మామూలుగా నిమినేటెడ్ పదవుల నియామకం సిఎం నిర్ణయం మేరకు జరుగుతాయి. అలాంటి సిఎమ్మే పదవిలో నుండి  దిగిపోయినపుడు మిగిలిన వారు కూడా రాజీనామాలు చేయటం ఎప్పుడూ జరిగేదే.

కానీ ఇపుడు మాత్రం చంద్రబాబునాయుడు నియమితులైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, సలహాదారులు మాత్రం తమ పదవులను ఇంకా అంటిపెట్టుకునే ఉండటం విచిత్రంగా ఉంది. ఇదే విషయంపై  సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, సలహాదారులు వెంటనే రాజీనామాలు చేయాలని ఆదేశించటం నిజంగా దురదృష్టమే.

ఒకవేళ ఛైర్మన్లు, సలహాదారులు రాజీనామాలు చేయకపోతే వెంటనే వాళ్ళను ఆయా పదవుల నుండి తొలగించాలని వివిధ శాఖలకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్టిసి ఛైర్మన్ గా వర్ల రామయ్య ఇంకా రాజీనామా చేయకుండా తిరుగుతున్నారు.  ఈయనెప్పుడూ నైతిక విలువలు, నీతుల గురించే మాట్లాడుతుంటారు. ఛైర్మన్ గా రాజీనామా చేయని వర్ల ఆఫీసుకు రాకుండానే కారు వంటి అన్నీ సౌకర్యాలు వాడుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామందున్నారు.

అలాగే  ఏడు మిషన్లు, ఐదు  గ్రిడ్ల పేర్లతో అనేక శాఖల్లో చాలామంది సలహాదారులను చంద్రబాబు నియమించారు. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఏమి ఉపయోగమో తెలీదు కానీ లక్షల్లో జీతాలైతే తీసుకున్నారు వాళ్ళంతా.  అలాంటి వాళ్ళు కూడా ఇంకా సలహాదారుల పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. వాళ్ళని కూడా వెంటనే తీసేయమని సిసోడియా చెప్పారు. మొత్తానికి వీళ్ళంతా తమ కుర్చీలను ఎప్పుడు ఖాళీ చేస్తారో చూడాల్సిందే.