అవును జగన్మోహన్ రెడ్డి మీడియా బాగా ఓవర్ యాక్షన్ చేసేస్తోంది. జగన్ , కెటియార్ అండ్ కో భేటీ ఖాయమైన తర్వాత మొదలైన యాక్షన్ సమావేశం మొదలయ్యే టప్పటికి ఓవర్ యాక్షన్ గా మారిపోయింది. భేటీపై జగన్ మీడియా చెబుతున్నదేమిటంటే, జగన్, కెసియార్ పొత్తులు పెట్టేసుకున్నట్లు, రెండు పార్టీలకు కలిపి 40 ఎంపి సీట్లు వచ్చేసినట్లు అంచనా వేసేస్తోంది.
ఎటూ ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటాని మద్దతుగా తాను కూడా కేంద్రానికి లేఖ రాస్తానని కెసియార్ చెప్పిన విషయం తెలిసిందే. రెండు పార్టీలకు 40 ఎంపి సీట్లు వచ్చేస్తున్నట్లు, ప్రత్యేకహోదాపై కెసియార్ కేంద్రానికి లేఖ రాసేస్తే కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేస్తున్నట్లుగా సాక్షి టివి పే….ద్ద బిల్డప్ ఇచ్చేస్తోంది. కెసియార్ లేఖ రాస్తే కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేస్తుందా ? ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వదలుచుకోలేదు కాబట్టే కేంద్రం ఇవ్వలేదు. ఇక్కడే జగన్ మీడియా ఓవర్ యాక్షన్ బయటపడిపోతోంది.
రేపటి లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంటే కీలకమన్నట్లుగా చెప్పేస్తోంది. జాతీయ స్ధాయిలోని పలువురు కీలక నేతలు కెసియార్ తో కలవటానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ మీడియా లెక్కేసేయటమే ఆశ్చర్యంగా ఉంది. యువ నేతలైన జగన్, కెటియార్ లు కలవటం చాలా కీలకమని ఈ ప్రభావం రాబోయే 30 ఏళ్ళలో ప్రభావం చూపనుందని ఒకటే ఊదరుగొట్టేస్తోంది. ఇక్కడే ఆలూ లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే సామెత అందరికీ గుర్తుకు వస్తోంది.
జగన్, కెటియార్ భేటీ జరిగినంత మత్రానా రానున్న ఎన్నికల్లో ఏపిలో జగన్ అధికారంలోకి వచ్చేసినట్లేనా ? జాతీయ మీడియా సంస్ధలు జరిపిన సర్వేల్లో వైసిపి మెజారిటీ ఎంపి సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసినంత మాత్రాన అవన్నీ నిజమవుతాయని గ్యారెంటీ ఏముంది ? పోయిన ఎన్నికల్లో కూడా అందరూ జగనే సిఎం అవుతాడని అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిందేంటి ? అదే ఫలితం వచ్చే ఎన్నికల్లో కూడా పునరావృతం కాకూడదని ఎక్కడా లేదే ?
ఇప్పటి వరకూ ఫెడరల్ ఫ్రంట్ అన్నది కేవలం ఊహాజనితమే. ఎందుకంటే, కాంగ్రేసేతర, బిజెపియేతర పార్టీలతో జాతీయ స్ధాయిలో ఫ్రంట్ కట్టటం అంత ఈజీకాదు. ప్రాంతీయ పార్టీల అధినేతల్లో చాలామందిలో ఎవరికి వారే ప్రధానమంత్రి అయిపోదామని కలలు కంటున్న వారే ఎక్కువ. మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, ములాయంసింగ్ యాదవ్ లాంటి చాలామందికి అర్జంటుగా ప్రధాని అయిపోవాలనే ఉంది. అవకాశం వస్తే కెసియార్ మాత్రం వదులుకుంటారా ? ఇక్కడే ఒకరు ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్దితి కనబడటం లేదు.
రెండు జాతీయ పార్టీల ఆధ్వర్యంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ రావాలంటే ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ ముందు త్యాగాలకు సిద్ధమవ్వాలి. కానీ ఏ ప్రాంతీయ పార్టీ అధినేత కూడా సిద్ధంగా లేరు. ఆ విషయాలను పక్కన పెడితే అసలు కెసియార్ ప్రయత్నాలకు చాలామంది సానుకూలంగానే స్పందించటం లేదన్నది వాస్తవం. కాబట్టే ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఇంకా బాల్యావస్ధలోనే ఉంది. వాస్తవం ఇలా వుంటే జగన్ మీడియా మాత్రం ఏదేదో చెప్పేస్తు రెచ్చిపోవటం ఆశ్చర్యంగా ఉంది.