ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతాం అని ఎన్నికల సంఘం, ఈ స్థితిలో కుదరదని ప్రభుత్వం గట్టిగానే పోరాడారు . ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుపై విపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగ విలువలను సుప్రీంకోర్టు కాపాడిందని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇదిలా ఉండగా మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సుప్రీం తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఏ అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత స్పందిస్తామని తెలిపారు.
ఎన్నికలను ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించాయనే విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే ప్రశ్నకు స్పందిస్తూ… కొద్దిగా సమయం ఇస్తే ఆ తర్వాత రియాక్ట్ అవుతామని చెప్పారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రస్తుతానికి తన సమాధానం ఇదేనని అన్నారు. ఆయన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.