వంగవీటి రాధా సంచలన నిర్ణయం: షాక్ లో వైసీపీ

విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి చెరగని ముద్ర ఉంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వీరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం పోరాడి కాపులు దేవుడిలా కొలొచుకునే నాయకుడిగా ఎదిగాడు వంగవీటి మోహన్ రంగా. ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన రాధా విజయవాడ తూర్పు నుండి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.

2014 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు మల్లాది విష్ణు. ఆయన రాకతో పార్టీలో రాధాకి గుర్తింపు తగ్గుతుంది అనేది రాధా వర్గీయుల ఆరోపణ. ఈ ఆరోపణలకు ఆజ్యం పోసినట్టు రాధా కర్చీఫ్ వేసిన విజయవాడ సెంట్రల్ టికెట్ ను మల్లాది విష్ణుకి ఖరారు చేసారు వైసీపీ అధినేత జగన్. దీంతో తీవ్ర అసంతృప్తి చెందాడు రాధా. ముందుగా పార్టీలో చేరిన తనని పక్కన బెట్టి కొత్తగా వచ్చిన విష్ణుకి సెంట్రల్ టికెట్ ఇవ్వటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాధా అనుచర గణం.

ఇంత అవమానం జరిగాక వైసీపీలో ఉండదలుచుకోలేదట వంగవీటి నాయకులు. రాధా, ఆయన సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ దీనిపై డిస్కస్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముందు ఒక హెచ్చరికగా శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం వెనక్కి తగ్గి రాధకు సీట్ ఇస్తే రాధా వైసీపీలో కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ఆయన పార్టీ మారతాడంటూ టాక్ నడుస్తోంది.

రాధాకి టీడీపీ నుండి ఆహ్వానం ఉంది. వల్లభనేని వంశీలాంటి సన్నిహితులు కూడా ఉన్నారు టీడీపీలో. కానీ ఆయన టీడీపీలో చేరడానికి ఒక చిక్కు ఉంది. వంగవీటి రంగాను హత్య చేయించింది టీడీపీ పెద్దలే అనేది రంగా అభిమానుల ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరితే రంగా అభిమానుల నుండి, కాపు సామాజిక వర్గం నుండి తీవ్ర విముఖత వచ్చే అవకాశం ఉంది.

ఆయనకి ఉన్న మరొక ఆప్షన్ జనసేన… జనసేన అధినేత పవన్, రాధా కాపు సామాజిక వర్గీయులే. ఒకే సామాజిక వర్గం కాబట్టి రంగా జనసేన దారి పట్టే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. వంగవీటి శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. అధిష్టానం తీర్పులో మార్పు లేకపోతే రాధా కూడా రాజీనామా చేస్తారని సమాచారం. ఇరువురు కలిసి జనసేనలో చేరుతారు అని బలంగా వినిపిస్తున్న వార్తలు. దీనిపై చర్చలు కూడా నెరపినట్టు తెలుస్తోంది.