మోడీపై టిడిపి అవిశ్వాసం.. అసలు మతలబు ఇదేనా?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన వెంటనే టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి స్పీకర్ అనుమతివ్వటం అంతటా చర్చగా మారింది. బిజెపి, టిడిపి కలిసి ఆడుతున్న నాటకమా లేక బిజెపి టిడిపిని ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్న డ్రామానా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే వేసవికాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చించమని ఎంత పట్టుపట్టినా అనుమతించని స్పీకర్.. ఈ సమావేశాల్లో ఏ మాత్రం గొడవలకు తావు లేకుండా వెంటనే ఆమోదించారు. దీంతో ముందే వీరు చర్చించుకొని ఈ నిర్ణయాన్ని అమలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపికి ఇచ్చిన హామీలతో పాటు, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను అమలు చేయాలని టిడిపి పోరాడుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు మోదీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ప్రత్యేక హోదాతో పాటు, అన్ని హామీలను నెరవేరుస్తామని హామీనిచ్చారు. ఆ తర్వాత బిజెపి కూటమిలో చేరిన టిడిపి నిజంగానే అన్ని  హామీలు నెరవేరుతాయని భావించింది. కానీ నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంతో బిజెపి కూటమి నుంచి వైదొలిగింది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉక్కుకర్మాగారం, కేంద్రసంస్థల ఏర్పాటు ఇవన్నీ ఏవీ కూడా నెరవేర్చలేదని టిడిపి ఆరోపిస్తుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బిజెపి ప్రత్యేక హోదా కుదరదని ప్రత్యేక ప్యాకేజిని అమలు చేస్తామని ప్రకటించింది. దీనిని ఏపీ సీఎం చంద్రబాబు వ్యతిరేకించినా ఆ తర్వాత దానికి ఆయన ఒప్పుకున్నారు. ప్రత్యేక ప్యాకేజికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని విపక్షాలు వ్యతిరేకించినా ఆయన నిర్ణయం మార్చుకోలేదు. అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజిపై చర్చ పెట్టి దానికి అభినందనలు తెలుపుతూ తీర్మానం కూడా చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడికి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎవరైనా ప్రత్యేక ప్యాకేజి వద్దంటే మీకేం తెలుసంటూ ఘింకరించారు చంద్రబాబు.

ఇంత వరకు బాగానే ఉన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజి వద్దంటూ ఉద్యమం ప్రారంభించారు. దీనికి తోడు ప్రతిపక్షనేత జగన్ కూడా తన పాదయాత్రలో, సభలలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలకు వివరించారు. దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. కొత్తగా ఏమైనా అడిగామా ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నామని వారు ఉద్యమించారు. దీంతో చంద్రబాబు రూటు మార్చి యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజి వద్దు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడితో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు.

గత సమావేశాల్లో చర్చకు అనుమతించని బిజెపి ఇప్పుడు అనుమతించటంపై పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే కేంద్రం చేస్తున్న సహాయాన్ని టిడిపి కనిపించకుండా చేస్తుందని బిజెపి వాదన. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి  నిధులిస్తున్నప్పటికి చంద్రబాబే ప్రాజెక్టు నిర్మిస్తున్నాడన్న ప్రజల్లో ఉందని బిజిపి భావిస్తోంది. అలాగే కేంద్ర  ప్రభుత్వం అనేక నిధులు ఇచ్చినా టిడిపి అవి ఏవి కానరాకుండా చేస్తుంది. దీంతో అవిశ్వాసం ఎలాగైనా గెలుస్తామనే విశ్వాసంతో ఉన్న బిజెపి.. అవిశ్వాస చర్చలో టిడిపి తీరును ఎండగట్టాలని భావిస్తుంది. అందుకే ఇతర పక్షాలు ఇచ్చిన అవిశ్వాసాలను పక్కకు పెట్టి టిడిపి ఇచ్చిన అవిశ్వాసాన్నే పరిగణలోకి తీసుకుందని బిజెపి నేతలు అంటున్నారు. దీంతో చంద్రబాబు రాజకీయం దేశవ్యాప్తంగా బహిర్గతమవుతుందని బిజెపి అంచనా. ఇది నిజంగానే బిజెపి చేస్తున్న పనా లేక నాటకమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, టిడిపి ఎవరిపైనా విమర్శలు లేకుండా అవిశ్వాసానికి అనుమతించి అటు బిజెపి, ఒక వేళ ఓడితే సరిపడా మంది లేక ఓటమి పాలయ్యామని టిడిపి ప్రజలను నమ్మించే అవకాశం ఉంది.   అవిశ్వాస మంత్రాన్ని టిడిపి, బిజెపి కలిసే సాగిస్తున్న ఆటగా పలువురు చెబుతున్నారు.