ఒకప్పుడు అందరి కలగా మారిన ఐటీ ఉద్యోగం.. ఇప్పుడు ఆరోగ్యపరంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నై, బెంగుళూరు, పూణే లాగే హైదరాబాద్‌లోనూ ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారినట్లు తాజా అధ్యయనాల్లో స్పష్టమవుతోంది. వారానికి ఐదు రోజులే పని, కూల్ లైఫ్‌స్టైల్, భారీ జీతాలు.. ఇవన్నీ బయటివారికి ఆకర్షణగా కనిపించినా.. ఆ ఉద్యోగం వెనుక అనారోగ్య ఛాయలు కనిపిస్తున్నాయని తాజా నివేదిక తేల్చింది.
నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన 2025 అధ్యయనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 345 మంది ఐటీ ఉద్యోగుల్లో 84 శాతానికి ఫ్యాటీ లివర్ (MAFLD), 71 శాతానికి ఒబెసిటీ, 34 శాతానికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు తేలింది. ఈ గణాంకాలు అంత తేలికగా తీసుకునేలా లేవు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి. నడ్డా ఈ వివరాలను అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభలో వెల్లడించారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా.. నిరంతరం కూర్చునే ఉద్యోగ ప్రకృతి, ప్రాజెక్టుల డెడ్‌లైన్లు, నిద్రలేమి, అసమతుల్యమైన ఆహారం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, రోజురోజుకీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి వంటి అంశాలను వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే వృద్ధాప్యం వయస్సులో వచ్చే వ్యాధులు… ఇప్పుడు 30 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి.
ఈ పరిశోధనను ICMR ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం “ఇండియన్ మెటబాలిక్ అండ్ లివర్ డిసీజ్ ఫేజ్-1” కింద చేపట్టింది. దీని ఉద్దేశం మెటబాలిక్ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడం, నిర్ధారణకు టెక్నాలజీ సహాయంతో ముందుగానే ప్రమాదాలను గుర్తించడమే. లివర్ సమస్యలు ఒక్కొక్కరిలో కాకుండా, ఐటీ రంగపు ఉద్యోగుల వర్గంగా ఏర్పడుతున్నాయి.
ఈ స్థితిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే… ఉద్యోగులే జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్‌కు గుడ్‌బై చెప్పాలి. పని ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఎంచుకోవాలి. వీటిని పాటిస్తేనే ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయట పడొచ్చు.
కార్లు, ఫ్లాట్లు, గాడ్జెట్లు కాదు… ఆరోగ్యమే నిజమైన సంపద అని గుర్తించాల్సిన సమయం ఇది. ఇప్పటికైనా మేలుకోకపోతే… భవిష్యత్తులో జీతం అంతా ఆసుపత్రి బిల్లులకే ఖర్చవుతుందన్న హెచ్చరికను ఈ అధ్యయనం మరొక్కసారి గుర్తు చేస్తోంది.
