ఉద్యోగులతో గులాబీ పార్టీకి అంత వీజీ కాదు.!

నీళ్ళు, నిధులు, నియమకాలు.! ఇదీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నినాదం. నీళ్ళ విషయానికొస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినా, ఆ ప్రాజెక్టు చుట్టూ చాలా వివాదాలున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఓ బ్యారేజీలో పిల్లర్ల కుంగుబాటు అత్యంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

పిల్లర్ల కుంగుబాటు వెనుక విద్రోహ శక్తుల కుట్ర.. అనే వాదన తెరపైకొచ్చింది. సరిగ్గా ఎన్నికల ముందర ఇలాంటి పరిణామం.. అధికార భారత్ రాష్ట్ర సమితికి మింగుడుపడని విషయమే. ఇక నిధుల విషయానికొస్తే.. అదో అర్థం కాని పంచాయితీ.

నియామకాల విషయంలో ఉద్యోగులే కాదు, నిరుద్యోగులూ సంతృప్తిగా కనిపించడంలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులుగా వున్న చాలామంది ఇప్పటికీ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే వున్నారు. ‘ఇంటికో ఉద్యోగం’ అంటూ నినదించింది తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమ సమయంలో.

కానీ, ఆ ఇంటికో ఉద్యోగం అనే కల సాకారం కాలేదు. అదో అబద్ధపు ప్రచారంగానే మిగిలిపోయింది. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం, ఎక్కువమందికి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్న విమర్శ వుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకి ముందు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ మార్పు కనిపిస్తోంది.

ఈ ఎన్నికలు తెలంగాణలో అధికార పార్టీకి అంత తేలికైన వ్యవహారం కాదు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గట్టెక్కుతుందనేది కొందరి వాదన. అదే సమయంలో, అధికార బీార్ఎస్ దారుణ పరాజయాన్ని చవిచూస్తుందనీ ఇంకొందరు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ సమాజం అయితే, ‘ఈ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందేమీ లేదు’ అని గళం విప్పుతుండడం గమనార్హం.