టీసీఎస్ లో దొంగలు పడ్డారు… ఉద్యోగులపట్ల కంపెనీ కీలక నిర్ణయం!

కాదేదీ కుంభకోణాలకు అనర్హం! కేవలం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనే కుంభకోణాలు జరుగుతాయని. ముడుపులకు ఉద్యోగాలనే ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనే ఉంతుందని అనుకుంటే పొరపాటే అని బల్లగుద్ది చెప్పే ఘటన తాజాగా దేశీయ ఐటీ కంపెనీ “టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్)” లో వెలుగు చూసింది. ఈ వివరాలను టీసీఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును… దేశీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లో లంచాలకు ఉద్యోగాలు అనే కుంభకోణం జరిగిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని గుర్తించింది. ఈ మేరకు లోతైన విచారణకు కమిటీని నియమించింది. ఈ క్రమంలో సుమారు నాలుగు నెలల పాటు దర్యాప్తు జరిపిన సదరు కమిటీ ఇటీవలే ఈ కుంభకోణానికి సంబంధించి నివేదికను సమర్పించింది.

వివరాళ్లోకి వెళ్తే… టీసీఎస్ లో లంచాలకు ఉద్యోగాలు కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణంలో మొత్తం 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు టీసీఎస్‌ గుర్తించిందని తెలుస్తుంది. దీంతో… వీరిలో 16 మందిని ఉద్యోగం నుంచి తొలగించగా.. మరో ముగ్గురిని రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విధుల నుంచి బదిలీ చేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఆరుగురు వెండర్స్ సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించింది.

వాస్తవానికి వెండర్స్ తో కలిసి కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌ లో ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే ఈ విషయంపై అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో… ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని టీసీఎస్ యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది.

ఈ క్రమంలోనే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న 19 మందిని గుర్తించి చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాలపై స్పందించింది టీసీఎస్. ఇందులో భాగంగా… ఈ కుంభకోణంలో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో… ఈ కుంభకోణంతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.

అదేవిధంగా… ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్న టీసీఎస్… దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. అందులో భాగంగా… రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని వెల్లడించింది.

కాగా… 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.11,342 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇక వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలికినట్లు పేర్కొంది. అదేవిధంగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.