అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యువతి కిడ్నాప్ కు యత్నించిన స్వామి ప్రబోధానంద శిష్యుడిని రక్షిస్తున్నారంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

స్వామి ప్రబోధానంద శిష్యుడు నాగరాజు. గురువారం ఉదయం తాడిపత్రిలో ఓ ఇంటి ముందు యువతి ముగ్గు వేస్తుండగా యువతి కళ్లలో కారం కొట్టి కిడ్నాప్ కు యత్నించాడు. ఆమె అరుపులు విన్న తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారు బయటికి వచ్చి నాగరాజును పట్టుకున్నారు. కోపంతో నాగరాజును చితకబాదారు.

అక్కడి నుంచి తప్పించుకున్న నాగరాజు తన పై దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు విషయమై దాడి చేసిన వారిని పోలీసులు స్టేషన్ కు రమ్మన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున్న అక్కడకు చేరుకున్నారు. కిడ్నాప్ కు యత్నించిన వ్యక్తి పై చర్య తీసుకోకుండా అమాయకులను జైల్లో పెట్టే పని చేస్తున్నారని వారు స్టేషన్ కు ముందు ఆందోళనకు దిగారు.

కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జెసి  ప్రభాకర్ రెడ్డి స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్వామి ప్రబోధానందను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఆ తర్వాత నేతలు, కార్యకర్తలంతా ప్రధాన రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.