High Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతో కలిసి పెద్దారెడ్డి నివాసానికి బయలుదేరారు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించి భారీగా మోహరించారు. పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి వస్తున్న టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. మరోవైపు పట్ణణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురానికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇరు వర్గాల మధ్య వివాదానికి కారణమైంది. తాను ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజాన్ని కొనసాగిస్తానని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో పాటు వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలోని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం తన ఇంటికి తాను వస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పలు మార్లు తాడిపత్రికి రావడానికి ట్రై చేసిన ఆయనను శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఏడాది కాలంగా ఆయన తాడిపత్రికి దూరంగానే ఉంటున్నారు.