మోదీని వదిలేది లేదంటున్న చంద్రబాబు, అవిశ్వాసానికి ఏర్పాట్లు

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి పై మళ్లీ అవిశ్వాసం పెట్టేందుకు టిడిపి రంగం సిద్దం చేస్తున్నది. గత పార్లమెంటు సమావేశాలలో  ఈ ప్రయత్నం సఫలం కాలేదు. అప్పుడు వైసిపి కూడా ఈ నోటీసే ఇచ్చింది  అయితే,  ఈసారి కర్నాటక ఎన్నికల తర్వాత ఏర్పడిన భిన్నమయిన పరిస్థితులలో టిడిపి మళ్లీ  అవిశ్వాసం ప్రతిపాదన తీసుకువస్తున్నది. కర్నాటక ఎన్నికల్లో బిజేపి ఓడిపోయాక, యడ్యూరప్పతో మరికొందరు ఎంపిలు రాజీనామా చేసి అసెంబ్లీకి వచ్చాక లోక్ సభ లో ఎన్డీయే మెజారిటీ తగ్గింది. దానికి తోడు ఈ మధ్య కాలంలో బిజెపి వ్యతిరేక శక్తులు కూడా యాక్టివ్ అయ్యాయి. బెంగాల్ మమతా బెనర్జీ, ఢిల్లీ కేజ్రీవాల్, ఎన్ సిపి శరద్ పవార్, శివసేన ఉద్ధావ్ ధాకరేలు బిజెపి మీద కత్తులు నూరు తున్నారు. దానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెసేతర బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు విరమించుకున్నాక, చంద్ర బాబు నాయుడు బిజెపి మీద దెబ్బ వేయాలనుకున్నారు. దీనికోసం ఆయన ఎంపిలను రంగంలోకి దించి ఇతర బిజెపి వ్యతిరేక పార్టీల మద్ధతు కూడగట్టేందుకు ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టారు. అయితే,   ఈ  ప్రయత్నాలను వమ్ము చేసేందుకు   వైసిపి ఇంకా ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందుకంటే, వైసిపి ఎంపిల రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.  వైసిపి వాళ్లు లోక్  సభ కు కు వస్తారని, ఏదో ఒక విషయం మీద గొడవ చేస్తూ తీర్మానం నోటీసు చర్చకు రాకుండా అడ్డుకుంటారని కూడా నాయుడికి తెలుసు.

ముంబైలో శరద్ పవార్, ఉద్దవ్ థాకరేలతో ఎంపీలు తోట నరసింహం, రవీంద్రబాబులు కలిసి అవిశ్వాసానికి మద్దతును కోరారు.అలాగే చెన్నైలో డీఎంకే, అన్నాడిఎంకే నేతలను టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలువనున్నారు. హైదరాబాద్ లో టిఆర్ ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డిలను సుజనా చౌదరి, కిష్టప్ప, మాల్యాద్రి, నారాయణ కలిశారు. విభజన హామీల అమలుకు పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని, కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతున్నామని తమకు మద్దతివ్వాలని వారు వివిధ పార్టీల నేతలను కోరారు. వారి నుంచి  కూడా సానుకూల స్పందన వచ్చినట్టు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ను కూడా అశోక్ గజపతి రాజు, శివప్రసాద్, నారాయణ త్వరలో కలువనున్నారు.

గత పార్లమెంట్  సమావేశాల్లోనే టిడిపి, వైసిపి కలిసి పార్లమెంట్ లో తీవ్ర పోరాటామే చేశాయి. రాజ్యసభ, పార్లమెంటులను కూడా స్తంభింపజేశాయి. వివిధ వేషాధారణలతో నిరసన తెలిపారు. అయినా పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ వారికి స్పందన లభించలేదు. అప్పుడే టిడిపి, వైసిపిలు వేరువేరుగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే ఉభయ   సభలు వాయిదా పడ్డాయి.  దీంతో వైసిపి ఎంపీలు రాజీనామా  చేశారు. స్పీకర్ వారితో దఫాలుగా చర్చలు జరిపినా వైసిపి సభ్యులు రాజీనామాలు వెనక్కు తీసుకోకపోవడంతో వాటిని ఎట్టకేలకు ఆమోదించారు. ప్రస్తుతం టిడిపి చేస్తున్న అవిశ్వాస  ఎత్తుగడలు ఫలించేనా అనే చర్చ  జరుగుతోంది.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ముందుగా 50 మంది సభ్యులు సంతకం చేసిన నోటిసును స్పీకర్ కు అందజేయాలి. అలాగే సభలో 50 మంది సభ్యులకు తగ్గకుండా ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించాలి. ఈ తీర్మానాన్ని అనుమతించిన తర్వాత పది రోజుల వ్యవధిలో స్పీకర్ నిర్ణయించిన తేదిలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, చర్చ జరుగుతాయి. అప్పుడు సభకు హాజరై ఓటు వేసిన  వారిలో మెజార్టి సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస   తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక కారణం సూచించాల్సిన అవసరం లేదు.  రాజ్యాంగంలో ఎక్కడ కూడా అవిశ్వాస తీర్మానం గురించి ప్రత్యక్షంగా పేర్కొనలేదు. ఎన్నిసార్లయినా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశ  పెట్టవచ్చు. ఇప్పటి వరకు 26 సార్లు  పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆరు నెలల్లో రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించరు.

మొదటిసారి 1962లో జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇది అప్పుడు చర్చకు కూడా రాలేదు. రెండో సారి 1963లో నెహ్రూ ప్రభుత్వంపైనే జెబి కృపలానీ ప్రవేశపెట్టారు కానీ  అది వీగిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని అత్యధికంగా ఇందిరాగాంధీ ప్రభుత్వంపై పదిహేను సార్లు  ప్రవేశపెట్టారు. పివి నరసింహారావు ప్రభుత్వంపై మూడు సార్లు, ఎల్బీశాస్త్రి పై మూడు సార్లు ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం బిజెపికి పార్లమెంటులో 271 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం గెలవాలంటే 1/3 వంతు మెజార్టీ కావాలి. ఎన్నికలకు పది నెలల సమయమే ఉండటంతో అవిశ్వాసం  గట్టేక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  టిడిపి నేతలు మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి అవిశ్వాసం నెగ్గాలనే కసితో తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అవిశ్వాసం అసలు చర్చకు వచ్చేనా అనే వార్తలు కూడా వస్తున్నాయి. టిడిపి వ్యూహం, బిజెపి ప్రతివ్యూహాలతో ఏమవుతుందో చూడాలి.