వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం కూడా రాష్ట్రంలో వివాదం అవుతుంది. మొన్న ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చివరకి ఆ నిర్ణయంపై హై కోర్ట్ స్టే కూడా విధించింది. అయితే ఇప్పుడు తాజా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు.దాని తరువాత అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కొనసాగించాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
అసలు ఉచిత విద్యుత్ కి డబ్బులు ఇవ్వడం ఎందుకు…? ఎందుకు రైతులు కట్టడం ఎందుకు…? ఉచిత విద్యుత్తు అమలు చేయవచ్చు కదా అనే డిమాండ్లు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ మైలేజ్ కోసం వాడుకోవాలని చేస్తుంది. ఈ నిర్ణయం వెనక ఉన్న లోపాలను ప్రజలకు తెలిసేలా చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 20మంది ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేసారని సమాచారం. పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్లి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని అడ్డుకునే విధంగా ప్రోత్సహించాలని కూడా పార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రైతుల వద్దకు నేతల పాదయాత్రగా వెళ్లి ఉచిత విద్యుత్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి పెద్దఎత్తున పోరాటం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం పై తీవ్రస్థాయిలో అటు రైతులు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రభుత్వంపై వ్యతిరేకంగా మార్చగలిగితే టీడీపీ కి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా టీడీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచి ప్రభుత్వాన్ని కూల్చడానికి టీడీపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.