Super Six: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. ఈ 15 నెలల్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినట్లు సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఊరు వాడా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు, ఇతర కూటమి ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్-సూపర్ ఫ్లాప్
అయితే సూపర్ సిక్స్-సూపర్ ఫ్లాప్ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చడానికి మాత్రమే సూపర్ హిట్ అంటూ బలప్రదర్శనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది పక్కన పెడితే నిజంగానే సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేసిందా..? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళాశక్తి, యువ గళం, అన్నదాత సుఖీభవ, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక హామీలు ఇచ్చారు.
మహిళలకు మోసం
మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, తల్లికి వందనం, మహిళలకు నెలకు రూ.1500 వంటి హామీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత తల్లికి వందనం పథకం ప్రారంభించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పథకం కింద పలు కొర్రీలు పెట్టి లబ్ధిదారులను కట్ చేశారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా అర్హులైన విద్యార్థులు ఉంటే 60 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకం వర్తింపచేశారని మండిపడుతున్నాయి. అంటే దాదాపు 20 లక్షల మంది అర్హులను తీసివేశారని చెబుతున్నాయి. అలాగే దీపం పథకంలో భాగంగా ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఎంత మందికి ఇస్తున్నారో తెలియడం లేదంటున్నాయి. మహిళలకు నెలకు రూ.1500, ఏడాదికి రూ.18,000 అంటూ ఊదరగొట్టారని కానీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నాయి. మహిళలను మోసం చేశారని ఫైర్ అవుతున్నాయి. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా తమ ఒత్తిడితో సంవత్సరం తర్వాత ప్రారంభించారంటున్నాయి.
రైతులకు పంగనామం
అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని 55 లక్షల మంది రైతులను మోసం చేశారని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి రైతకు రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేవలం రూ.14వేలు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రూ.6వేలు కేంద్రం ఇస్తుందని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు రైతులకు పంగనామం పెట్టారని మండిపడుతున్నారు.
గోరంత చేసి కొండంత ప్రచారం
ఇవే కాకుండా రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కరికైనా రూ.3,000 చొప్పున ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. యువతకు ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలెక్కడ? అని అడుగుతున్నారు. పెట్టుబడులు పెట్టని పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చేసినట్లేనా? అని క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్కరికీ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా సూపర్ సిక్స్ ఎలా సక్సెస్ అవుతుంది? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం నిజంగా కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని సెటైర్లు వేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్, విద్యుత్తు చార్జీలు తగ్గింపు, జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం లాంటి ఎన్నో హామీలు నెరవేర్చకుండానే సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటూ సంబరాలు ఎలా చేసుకుంటున్నారని విమర్శించారు. మొత్తంగా చూసుకుంటే సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి రెండు మినహా మిగిలిన ప్రధాన హామీలు ఏవి అమలు కాలేదని స్పష్టంమవుతోంది. అయినా కానీ ప్రభుత్వం సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవాలు చేసుకోవడం విడ్డూంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.


