ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు తుదిశ్వాస విడిచారు. గత రాత్రి కుటుంబరావు గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1933 ఆగస్టు 10న జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టారు.
జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఎడిటోరియల్ ఎడిటర్ గా తుర్లపాటి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంకు సెక్రెటరీగా పని చేశారు. జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, 18మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం..నా గళం లాంటి పుస్తకాలను ఆయన రచించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీతో సత్కరించింది. ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన వాహిని పత్రికలో 1951లో తొలిసారిగా ఉపసంపాదకుడిగా తుర్లపాటి పనిచేశారు.
కుటుంబరావు మృతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి… దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. “ప్రముఖ జర్నలిస్టుగా, మంచి వక్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కుటుంబరావు ఎన్నో సేవలు అందించారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు… అలాగే తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలు చేశారు. గొప్ప జర్నలిస్టు” అని ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.
తుర్లపాటి కుటుంబరావు మృతిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. “సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావుగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది.(1/2) pic.twitter.com/DaQ2zeip74
— N Chandrababu Naidu (@ncbn) January 11, 2021