షాకింగ్: ఆ నేతల ఒత్తిడే కిడారి ప్రాణాలను బలిగొన్నదా?

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపేశారు. మావోయిస్టులు హెచ్చరించినా కిడారి నల్ల క్వారీని ఎందుకు ఆపలేకపోయారు? కిడారి హత్యకు, విజయవాడ టిడిపి పెద్దలకు సంబంధం ఉందా? పరోక్షంగా ఆ ప్రముఖ నేతలే కిడారి హత్యకు పరోక్షంగా కారణమయ్యారా? అంటే వీటన్నిటికీ అవుననే సమాధానం వస్తున్నది కిడారి కుటుంబీకుల నుండి.  దీనిపై కిడారి కుటుంబీకులు చెబుతున్న మరింత సమాచారం కింద ఉంది చదవండి.
 
కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు చంపడం వెనుక ప్రధానంగా వినిపించిన కారణం నల్ల క్వారీ. దీనిని నిలిపి వేయాలని, లేదంటే ప్రాణాలు తీస్తామని మావోలు పలుమార్లు హెచ్చరించారు. ప్రాణాల మీదకు వచ్చినా ఎందుకు సర్వేశ్వరరావు అవి నిలిపివేయలేదు అనేది అందరి మదిలో మెదులుతున్న సందేహం.
 
ఈ నల్లక్వారీ నిర్వహణ వెనుక టిడిపి పెద్దల హస్తం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కిడారి బావ పేరు మీద హుకుంపేటలో “గూడ” క్వారీ ఉంది. ఈ క్వారీ తవ్వకాల వలన సుమారు ఆరేడు గ్రామాల ప్రజలు తమకు నష్టం జరుగుతుందంటూ ఆందోళన చేపట్టారు. మావోలు కూడా హెచ్చరికలు జారీ చేసారు. ప్రజల నుండి ఇంతటి వ్యతిరేకత, మావోల నుండి ప్రాణభయం ఉన్నప్పటికీ కిడారి లెక్క చేయకపోవడానికి కారణం టిడిపి నేతల ఒత్తిడే అన్న విమర్శ వినిపిస్తోంది. దీని గురించి కిడారి కుమారుడు సన్నితుల వద్ద చెప్పుకుని బాధ పడినట్లు తెలుస్తోంది.
 
వైసిపిలో ఉన్నప్పుడు మైనింగ్ జోలికి పోని, కిడారి టిడిపిలో చేరినప్పటి నుండే క్వారీ నడపడం స్టార్ట్ చేశారని చెబుతున్నారు. ఈ మైనింగ్ వ్యవహారం వలన ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఆందోళన చేపట్టారు. మావోలు క్వారీ తవ్వకాలు నిలిపివేయాలని, ప్రజా ఉద్యమానికి విలువ ఇవ్వాలని కిడారిని అనేకసార్లు హెచ్చరించారు. ఇవన్నీ కిడారి పెడచెవిన పెట్టడానికి కారణం విజయవాడకు చెందిన టిడిపి పెద్దల ఒత్తిడే కారణం అని తెలుస్తోంది. ఈ క్వారీ తవ్వకాల వలన నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతోందని కిడారి వారితో తెలిపినా సదరు నేతలు పట్టించుకోలేదని సమాచారం. వారి మాట కాదనలేని కిడారి తవ్వకాలు కొనసాగించారు. దీంతో ఆగ్రహానికి గురైన మావోలు కిడారిని అంతమొందించారు.
 
“క్వారీ నిలిపేయాలని నాన్న ఎప్పటి నుండో అనుకుంటున్నారు కానీ బెజవాడ నేతలు వద్దని ఒత్తిడి చేసారు. ఈ కారణంగానే నాన్న ప్రాణభయం ఉన్నా లెక్కచేయకుండా క్వారీ కొనసాగించారు. అందుకే ఇవాళ నాన్న మాకు దూరం అయ్యారు” అని కిడారి తనయుడు సన్నిహితులతో చెప్పుకుని ఆవేదన పడుతున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.
 
ఇప్పుడు ఇంతగా క్వారీ నడపాలని వత్తిడి తెచ్చిన ఆ బెజవాడ పెద్ద తలకాయలు ఎవరు అని ఆంధ్రా రాజకీయాల్లో చర్చలు బలంగా సాగుతున్నాయి.