ఫాఫం రామ్ గోపాల్ వర్మ.! ఆ కక్కుర్తి దేనికి.?

చాలా సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ తాను వోడ్కా మత్తులో ట్వీట్లేస్తున్నానని పేర్కొనడం చూశాం. ఆయన ఎప్పుడూ అదే పనిలో వుంటాడా.? ఏమో, అంతేనేమో.! నా ట్విట్టర్ నుంచి తెలుగులో ట్వీట్లు వస్తే అవి నావి కావు.. అని ఓ సందర్భంలో ఆర్జీవీనే స్వయంగా చెప్పాడు. సో, ఇప్పుడు ఆర్జీవీ ట్విట్టర్ నుంచి వస్తున్న ‘రెట్టలు’ ఆయనవి కావన్నమాట. గత కొద్ది రోజులుగా ఎడా పెడా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ నుంచి తెలుగు ట్వీట్లు వస్తున్నాయ్. అవి కూడా, తెలుగుదేశం పార్టీనో.. జనసేన పార్టీనో.. టార్గెట్ చేస్తూ.

వీటి వల్ల రామ్ గోపాల్ వర్మ, తెలుగు రాష్ట్రాల్ని రాజకీయాల్ని.. పోనీ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాల్ని.. పోనీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏదన్నా నియోజకవర్గంలో.. కాదు కాదు ఓ వార్డు పరిధిలో రాజకీయాల్ని అయినా మార్చగలడా.? ‘అంతా నా ఇష్టం..’ అంటాడు వర్మ. ఆ లెక్కన, ఎవడిష్టం వాడిది కదా.! ఇక్కడేమో, ఆయనకి అన్నీ పద్ధతిగా కనిపించాలి. ఆయన మాత్రం పద్ధతి పాటించడు. అదే వర్మతో వచ్చిన చిక్కు.

ఆర్జీవీ తన పైత్యంలోకి పోలీసుల్ని లాగుతున్నాడు. రాజకీయ నాయకులు సవాలక్ష వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటన్నటినీ పోలీస్ శాఖ ‘పర్సనల్’గా తీసుకునే పరిస్థితి వుండదు. అచ్చెన్నాయుడు ఏదో అన్నాడు.. ఇంకో నాయకుడు ఏదో అన్నాడు కాబట్టి, పోలీసులు సహాయ నిరాకరణ చేయాలంటాడు వర్మ.

మరీ వర్మ కామెడీ పీస్ అయిపోతున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? వ్యవస్థలెలా నడుస్తాయో తెలియనోడు కూడా, వ్యవస్థల్ని తన ట్వీట్లతో శాసించేయాలనుకుంటున్నాడు. అదే పెద్ద కామెడీ మరి.