కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ప్లాన్ వేేస్తున్నట్లున్నారు.
మూడు బిజెపి రాష్ట్రాలలో జండా ఎగరేసినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వోడిపోవడం కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇబ్బందిగా ఉంది. అందుకే తెలంగాణను దారికి తెచ్చుకునే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. తెలంగాణను తను దగ్గిరుండి చూసుకోవాలనుకుంటున్నారు. ఈ లోక్ సభ ఎన్నికలను వాడుకుని ఆయన తెలంగాణను మళ్లీ కాంగ్రెస్ గ్రిప్పులోకి తీసుకురావాలనుకుంటున్నారు.
దానికోమార్గం కనిపించింది. దీనికి తెలంగాణ పక్క నుంచే లోక్ సభకు పోటీ చేసి కెసియార్ కు పక్కలో బల్లెం కావాలని ఆయన అనుకుంటున్నారు. ఈ యుద్ధ తంత్రం అమలుచేసేందుకు ఆయన తెలంగాణ నుంచి లోక్ సభ పోటీ చేస్తే బాగుండేది. అయితే, తెలంగాణలో సేఫ్ సీటు లేదు కాబట్టి పక్కనున్న కర్నాటకనుంచి పోటీ చేయానుకుంటున్నారు. అదికూడా ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ లో భాగం, ఇపుడు హైదరాబాద్-కర్నాటక రీజియన్లో భాగమయిన బీదర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.
హైదరాబాద్- కర్నాటకలో ప్రాంతంలో ఉండే బీదర్ లో గుడారం వేస్తే కర్నాటకతో పాటు, మహారాష్ట్ర, తెలంగాణలను కూడా పర్యవేక్షించవచ్చు. సరిగ్గా ఈ ఉద్దేశంతోనే ఆయనకు బీదర్ నియోజవకర్గం అప్పగించాలని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ భావిస్తున్నది. బీదర్ కాంగ్రెస్ బలమయిన కోట. అక్కడున్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో అయిదింటిని గెల్చుకుని కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
అందువల్ల రాహుల్ పోటీ చేసేందుకు బీదర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మధ్య కలబుర్గి (గుల్బర్గా) లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. కలబుర్గి లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు మల్లి కార్జన్ ఖర్గే నియోజకవర్గం కూడా. కలబుర్గి సమావేశంలో రాహుల్ గాంధీ బీదర్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, పార్టీ నేతలు కార్యకర్తలు ఇకఏర్పాట్లు మొదలుపెట్టాలని కూడా ఆయన సలహా ఇచ్చినట్లు సీనియర్ నాయకుడొకరు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెప్పారు.
కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఇలాంటి చర్చ పార్టీలో జరిగినట్లు తనకు తెలియదని అంటూనే, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచై నా పోటీ చేయవచ్చు, బీదర్ నుంచి పోటీ చేసే విషయాన్ని కూడా రూల్ అవుట్ చేయలేమని అన్నారు.
‘రాహుల్ గాంధీ బీదర్ నుంచి పోటీ చేయాలే గాని, హైదరాబాద్ -కర్నాటక రీజియన్ లో కాంగ్రెస్ వూడ్చేస్తుంది. రాహుల్ అక్కడి నుంచి పోటీ చస్తే కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో కనీసం 25 లోక్ సభ నియోజవవర్గాలను ప్రభావితం చేయగలరు,’అని కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ ఈశ్వర్ ఖండ్రే అంటున్నారు.