ఏపీలో త్రిముఖ పోటీ… తాజా సర్వే ఫలితాలివే!

మొన్నటి వరకూ ఒక లెక్క ఇకపై ఒకలెక్క అన్నట్లుగా ఏపీ రాజకీయ సమీకరణలు మారిపోయాయనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా నడుస్తుంది. నిన్నటివరకూ ద్విముఖ పోరుగా ఉన్న ఏపీలో.. ఇప్పుడు త్రిముఖ పోరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా… విపక్షాల్లో రెండు రకాల సమీకరణలు, రెండు రకాల కూటములు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా సర్వే ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ + జనసేన కూటమిలో మరోపార్టీ చేరికపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంలో తమతో బీజేపీ చేరికపై ఇప్పటికీ బాబు & కో వేచి చూసే దోరణిలోనే ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నిర్ణయం కోసం బాబు ఈ నెలాఖరువరకూ వేచి చూసే అవకాశాలున్నాయని అంటున్నారు.

అంటే… 2014 తరహాలో టీడీపీ + బీజేపీ + జనసేన కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్నారన్నమాట. ఈ విషయంలో బాబుతో పాటు పవన్ కూడా ఈ కలయికను బలంగా కోరుకుంటున్నారని తెలుస్తుంది. మరోపక్క ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా ఈ కూటమివైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే… టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలు అంగీకరించని పక్షంలో… బాబుకు ప్లాన్ బీ కూడా ఉంది.

ఇందులో భాగంగా తమతో జతకట్టేందుకు బీజేపీ అంగీకరించని పక్షంలో… వామపక్షాలను కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. మరోపక్క షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం కొత్త ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ కూడా పొత్తులపై ప్లాన్స్ చేస్తుందని తెలుస్తుంది. ఏపీలో టీడీపీ + జనసేన కూటమితో బీజేపీ కలిస్తే… వామపక్షాలతో కలిసి వెళ్లాలని వారు భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో ఎవరు ఎలా వెళ్లినా.. ఎవరు ఎవరితో కలిసి పోటీచేసినా… గెలుపు మాత్రం వైసీపీదే అని చెబుతూ తాజాగా ఒక సర్వే తెరపైకి వచ్చింది. ఈ సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ ల పెర్ఫార్మెన్స్ పై కూడా అభిప్రాయాలు వెలువడటం గమనార్హం. అంటే… ఏపీలో త్రిముఖ పోరు, చతుర్ముఖ పోరు ఉన్నా కూడా గెలుపు వైసీపీకే అని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి క్లీన్ మెజారిటీ, క్లియర్ మెజారిటీ కన్ ఫాం అని ఆ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

తాజాగా వెలువడిన పొలిటికల్ క్రిటిక్ సర్వే ఫలితాల ప్రకారం… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… అధికార వైసీపీకి 48 శాతం ఓటర్ల మద్దతు ఉందని ఆ సర్వే సంశ్థ తమ ఫలితాల్లో పేర్కొంది. ఇదే సమయంలో… టీడీపీ + జనసేనకు 44 శాతం, బీజేపీకి 1.5 శాతం, కాంగ్రెస్ కు 1.5 శాతం, ఇతరులకు ఏకంగా 5 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది.

ఇక సీట్ల విషయానికొస్తే… వైసీపీకి అత్యధికంగా 115 సీట్లు వస్తాయని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో… టీడీపీ + జనసేన కూటమికి 60 సీట్లు వరకు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ అంచనాల్లో అయిదు సీట్లు అటూ ఇటూ ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది. ఇక కాంగ్రెస్, బీజేపీలు బోణీ చేసే అవకాశం లేదని వెల్లడించింది. ఇక, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ + జనసేనక 8 సీట్లు వస్తాయని అంచనాగా వెల్లడించింది.