అందరి బతుకులు బయటపెడతా… పవన్ సంచలనం

చంద్రబాబునాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపోరాటయాత్రలో భాగంగా పవన్ ఈరోజు రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు, జగన్, బాలకృష్ణ ముగ్గురిపైనా ఒకేసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ, ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి కాళ్ళు పట్టుకున్న తర్వాత ఎన్టీయార్ విగ్రహాలను ఆవిష్కరించే నైతికతను చంద్రబాబు కోల్పోయినట్లు మండిపడ్డారు. అవసరమైతే ఓపోవటానికైనా సిద్ధమే కానీ ఐడియాలజీని మాత్రం మార్చుకునేది లేదంటూ చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు.

 

ఢిల్లీకెళ్ళి రాహూల్ కాళ్ళు పట్టుకుని తెలుగోడి ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టారన్న అర్ధం వచ్చేట్లు ఎద్దేవా చేశారు. తనకు కులాన్ని ఆపాదిస్తు చంద్రబాబు మాట్లాడటంపై మండిపడ్డారు. అలగాజనం, సంకరజాతి అంటూ బాలకృష్ణ కూడా ఎగతాళి చేశారట. రాహూల్ కాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఎన్టీయార్ పేరెత్తే హక్కు లేదన్నారు. ఎన్టీయార్ పేరెత్తే హక్కు కోల్పోయారు కాబట్టి విగ్రహాలకు ముసుగులేసేయాలంటూ అల్టిమేటమ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

 

నైతికత విషయంలో అందరికన్నా తాను ఉన్నత స్ధాయిలో ఉన్నట్లు పవన్ తన భుజాన్ని తానే చరుచుకున్నారు. తనకు అందరి జీవితాలు తెలుసంటూ చంద్రబాబు, జగన్, బాలకృష్ణ ముగ్గురినీ ఒకేసారి హెచ్చరించటం జిల్లాలో చర్చగా మారింది. తనకు అందరి జీవితాలు తెలుసని హెచ్చరించారు. తాను తలుచుకుంటే ప్రతీ ఒక్కరి జీవితాన్ని బయటపెట్టగలనంటూ తీవ్రంగా హెచ్చరించటం గమనార్హం. తనను తిట్టటానికే కార్యక్రమాలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు.  అధికారంలో చంద్రబాబు, ప్రతిపక్షంలో జగన్ ఫెయిల్ అయినట్లు మండిపడ్డారు. అంటే పవన్ అధికార్టీతో అంటకాగినంత కాలం ఏమి సాధించారో చెప్పలేదు. పోనీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా సాధించిందేమిటో అర్ధం కావటం లేదు.