ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన జతకట్టాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని బలంగా భావిస్తున్న పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకున్నారు. ఇదే సమయంలో బీజేపీని కలుపుకోవడానికీ విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ కోరికకు కామ్రెడ్లు గండికొడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలకూడదని బాబు – పవన్ లు బలంగా కోరుకున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా తమతో కలిస్తే ఇక ఢోకా ఉండదని భావించారు. అయితే… షర్మిళ రూపంలో ఏపీలో కాంగ్రెస్ కి జవసత్వాలు మొదలయ్యాయి! ఆమె ఎంట్రీతో కాంగ్రెస్ కేడర్ లో కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి కామ్రెండ్లు జతకట్టారు! ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విభజన హామీలు పేరు చెప్పి ఇటు వైసీపీని… అటు టీడీపీ – బీజేపీలను ఒకేట్ గాటికి కట్టి విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా… ఏపీకి రాజధాని లేకపోవడానికి టీడీపీ కారణం అని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బీజేపీ దెబ్బకొడుతుందని.. మూడు రాజధానులని చెప్పి జగన్ ఒక్కటీ నెరవేర్చలేదని నిప్పులు కక్కుతున్నారు.
అదేవిధంగా… తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లేనా అని కమ్యునిస్టులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు, రాజకీయ పార్టీలతో తాము కలసి పనిచేస్తామని చెబుతున్న కామ్రెడ్లు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి జతకడుతున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా… వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గానూ 26 సీట్లకు.. 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు. ఇదే సమయంలో ఈ నెల 20న జరిగే ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ లో వారు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంది. దీంతో… కాంగ్రెస్ తో కామ్రెడ్లు సై అనడం ఏపీలో ఎవరికి ప్లస్సు, మరెవరికి మైనస్సు అనే చర్చ తెరపైకి వచ్చింది.