జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఏలూరులో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పోరాటయాత్ర భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేల దాష్టీకాలు పెరిగిపోయాయన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే నేరాలు పెరిగిపోతాయని టిడిపి కి మద్దతు ఇచ్చాను అని తెలిపిన పవన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సభలో మాట్లాడుతూ… నాకు ప్రతిపక్ష నేత జగన్ లా వేల కోట్లు లేవు, లోకేష్ లా హెరిటేజ్ సంస్థలు లేవు ప్రజలకు సేవ చేయాలన్న ఆశతోనే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. జనసేన పార్టీకి ఒక ఆకు రౌడీ, వీధి రౌడీ సవాల్ విసురుతాడా అని ప్రశ్నించారు. దెందులూరు ఎమ్మెల్యే తన నియోజక వర్గంలోనే కాకుండా, ఏలూరులో కూడా రౌడీయిజం చేస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉండే ఏలూరులో 10 హత్యలు జరిగాయి అని పేర్కొన్నారు. ఒక ఆకు రౌడీ, వీధి రౌడీ పోలీసులపైన, దివ్యంగులపైనా దాడులకు దిగుతున్నారు. విధుల్లో ఉన్న మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడికి దిగారు. ఇలా చేస్తే రాష్ట్రంలో ఆడపిల్లకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వస్తే ఇలాంటి అకృత్యాలు, నేరాలు, నేర వ్యవస్థ పెరిగిపోతుందనే కదా ఆరోజు మీకు మద్దతు ఇచ్చాను అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు.
గతంలో కూడా వైసిపిలో గూండాలు, రౌడీలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇరు పార్టీల మధ్యన మాటల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో టిడిపి నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి వైసిపి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వైసిపి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.