ఇదిగో సాక్ష్యం… ఆ విషయంలో బాబు కంటే పవనే మేధావి!

సాధారణంగా రాజకీయాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో చంద్రబాబు తెలివి తేటలు పీక్స్ అని.. కొన్ని విషయాల్లో ఆయన్ను కొట్టేవారు ఉండరని అంటుంటారు పరిశీలకులు. పైగా అధికారం కోసం వెనకా ముందూ చూడకుండా.. ఎవరేమనుకుంటారనే ఆలోచనలు లేకుండా ముందుకు వెళ్లగలరని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయనను రాజకీయ చాణక్యుడు అని కూడా అంటారు.

బీజేపీతో పొత్తు పెట్టుకోవడం.. తర్వాత అది చారిత్రక తప్పిదం అనడం.. తిరిగి మరళా వారితోనే కూటమిగా కలవడం.. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ తో కలవడం.. అవసరమైనప్పుడు కమ్యునిస్టులను కలుపుకుపోవడం.. ఇవన్నీ ఆ చాణక్యంలో భాగమే అని చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం జనసేనతో కలిసి చంద్రబాబు ఏపీలో ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అయితే… ఇక్కడ మాత్రం చంద్రబాబు కంటే పవనే పొలిటికల్ ఇంటెలిజెంట్ అని అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి ఏపీలో జనసేనకు ఉన్న బలమెంత అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! 2024 ఎన్నికల్లో ఏ మేరకు ఆ బలం ఉండబోతుందనే సంగతి కాసేపు పక్కనపెడితే… 2019 ఎన్నికల్లో జనసేన బలంతో పాటు పవన్ కల్యాణ్ బలం కూడా బహిర్గతమైంది! ఆ ఎన్నికల్లో జనసేనకు ఒకే ఒక్క సీటు రాగా… ఆ పార్టీ అధినేత పవన్ మాత్రం రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో వాస్తవంలోకి వచ్చిన పవన్… వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.

2024 ఎన్నికల్లో కూడా జనసేన ఓంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలవడం కన్ ఫాం అని అంటున్నారు పవన్ కల్యాణ్. మరి ఇంకెందుకు ఆలస్యం… రంగంలోకి దిగితే.. రేపొద్దున్న హంగ్ వస్తే.. కర్ణాటకలో కుమార స్వామి తరహాలో ఏకంగా సీఎం కుర్చీ ఎక్కొచ్చు కదా.. అని ప్రశ్నించేవారికోసం ముందుగానే సమాధానం సిద్ధం చేసి చెబుతున్నారు. అదేమిటంటే… “రాష్ట్ర ప్రయోజనాల కోసం” అంట! అంటే… ఆయన సీఎం అయితే రాష్ట్రానికి ప్రయోజనం కాదా?

ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు ప్రత్యేకంగా జనసేన ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది.. పలానా నియోజకవర్గం జనసేనకు కంచుకోట అనే పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీకి లేదు! వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇకపై అలాంటి కొన్ని నియోజకవర్గాలకు అలాంటి కోట్స్ పెట్టుకోవచ్చు! దీంతో… టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలపై పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఆయన కోరికలు ఇప్పుడు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు.

దీంతో… టీడీపీ బలాన్ని తన బలంగా చేసుకుంటూ.. ఇప్పటికే టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అయినా గాజు గ్లాసును నిలపగలిగితే… రేపటి రోజున టీడీపీతో రాజకీయంగా చెడినప్పటికీ… ఆయా నియోజకవర్గాలు తమ ఆధీనంలో ఉండేలా పవన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో… ఈ విషయంలో మాత్రం చంద్రబాబు కంటే పవన్ కల్యాణే ఇంటెలిజెంట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు… రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2019 జగన్ వేవ్ లో అయినా.. అంతక ముందు వైఎస్సార్ హయాంలో అయినా రాజమండ్రిలో పసుపు జెండా ఎగరకుండా ఉండలేదు! అలాంటి కంచుకోటను అడుగుతున్నారు పవన్ కల్యాణ్! అక్కడ నుంచి జనసేనలో కీలక నేతగా ఉన్న కందుల దుర్గేష్ ను బరిలోకి దింపాలని ఫిక్సవుతున్నారు. అదే జరిగితే… ఇది చంద్రబాబు ఆత్మహత్యా సదృశ్యం అనడంలో సందేహం అక్కరలేదని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో తెనాలి నియోజకవర్గాన్ని కూడా ప్రస్థావిస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా గతంలో తెనాలి నుంచి గెలిచిన నాదండ్ల మనోహర్ కంటే ఎక్కువ మెజారిటీతో 2014లో గెలిచిన ఆలపాటి రాజాని కాదని… ఆ సీటుని కూడా సమర్పించేసుకోవడానికి బాబు సంసిద్ధులయ్యరని అంటున్నారు. ఇదే క్రమంలో రాజోలు కూడా అలాంటిదే అని.. పెందుర్తి ఆ కోవలోకే వస్తుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో బాబు & కో పునరాలోచన చేస్తారా.. లేక, సమర్పయామి అని సర్ధుకుపోతారా అన్నది వేచి చూడాలి!

ఏది ఏమైనా… ఈ విషయంలో చంద్రబాబు కంటే పవనే ఇంటెలిజెంట్ అని అంటున్నారు పరిశీలకులు.