Pawan Kalyan: అదొక జాతీయ రహదారి.. వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయ్.. ఆ వాహనాల శ్రేణులోని ఓ వాహనంపై ఓ పార్టీ అధ్యక్షుడు చాలా ధైర్యంగా, సాహసోపేతంగా కూర్చుని వున్నాడు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ఆయన తనదైన హీరోయిజం చాటుకునే ప్రయత్నం చేశారు.
ఆయనెవరో కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ‘250 కోట్లు కాదు కదా.. వెయ్యి కోట్లు సుపారీ ఎవడికన్నా ఇచ్చుకున్నాసరే.. నన్ను చంపడం మీ తరం కాదు..’ అని జనసేనాని వ్యాఖ్యానించారు కూడా. అదే ఆటిట్యూడ్ ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా ఆయన ప్రదర్శించారు.
ఇప్పటంలో ప్రజల ఇళ్ళని ప్రభుత్వం అక్రమంగా కూల్చేస్తోందనీ, కులాల కుంపట్లను రాజేస్తోందనీ జనసేన ఆరోపిస్తోంది. రాజకీయ పార్టీలన్నాక ఇలాంటి విషయాలపై స్పందిస్తే.. దాన్ని తప్పు పట్టడానికేమీ లేదు. మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద జనసేనానిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.. దాంతో, జనసేనాని అగ్రెసివ్ అయిపోయారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం.
కానీ, జాతీయ రహదారి మీద.. వాహనాల శ్రేణితో వెళుతూ.. వాహనంపైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూర్చుని, హీరోయిజం చాటడాన్ని ఏమనుకోవాలి.? చిన్న పొరపాటు.. పెను ప్రమాదానికి తావిస్తుంది. ప్రమాదమే జరిగి వుంటే, ఆ తర్వాత జరిగే రాజకీయ రచ్చ, విధ్వంసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
ఓ పార్టీ అధినాయకుడిగా సభ్య సమాజానికి పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నట్లు.? నాయకుడే ఇలా వుంటే, ఆ నాయకుడి అనుచరులు ఇంకెలా వుంటారు.? జాతీయ రహదారిపై కొన్ని నిబంధనలు వుంటాయ్. వాటిని పాటించడం ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ బాధ్యత.
సినిమాల్లో ఇలాంటి స్టంట్లు చూస్తుంటాం. నిపుణుల పర్యవేక్షణలో చేసినట్లు చెబతారు.. ఎవరూ వాటిని అనుకరించొద్దని సినిమావాళ్ళే చెబుతుంటారు. మరి, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఏం దిక్కుమాలిన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలనుకున్నట్టు.?